- కర్నాటకలో గోల్డ్ అన్వేషణ లైసెన్స్ అందుకున్న సింగరేణి సీఎండీ బలరాం
హైదరాబాద్, వెలుగు: ఖనిజ రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి కృషి చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని టీ హబ్‌లో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కీలక ఖనిజాల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సెమినార్ కు కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ‘‘క్రిటికల్ మినరల్స్ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.32 వేల కోట్లు కేటాయించింది.
క్రిటికల్ మినరల్స్ పై నిర్వహించిన వేలంపాటలో విజేతలైన సంస్థలకు అభినందనలు. ఖనిజాల అన్వేషణ పనులను వెంటనే ప్రారంభించాలి’’అని కిషన్ రెడ్డి సూచించారు. అనంతరం, కర్నాటకలోని దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు అనుమతిస్తూ సింగరేణికి జారీ చేసిన లైసెన్స్ పత్రాలను సంస్థ సీఎండీ ఎన్.బలరామ్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అందజేశారు.
గత మార్చిలో కేంద్ర గనుల శాఖ నిర్వహించిన కీలక ఖనిజాల వేలంపాటలో సింగరేణి సంస్థ 37.75 శాతం రాయల్టీతో దేవదుర్గ ప్రాంతంలో 199 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో బంగారం, రాగి అన్వేషణ హక్కులను సొంతం చేసుకున్నది. ఈ అన్వేషణకు సంబంధించిన లైసెన్స్, సర్టిఫికెట్లను కేంద్ర మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, సింగరేణి డైరెక్టర్‌కే.వెంకటేశ్వర్లు, జీఎంలు తాడబోయిన శ్రీనివాస్, శ్రీనివాస రావు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
