- 98% పనులు కంప్లీట్ అయినయ్
సికింద్రాబాద్, వెలుగు: స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో నిర్మిస్తున్న చర్లపల్లి శాటిలైట్ రైల్వే టెర్మినల్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ టెర్మినల్స్‌కు అదనంగా చర్లపల్లి టెర్మినల్ ను నిర్మిస్తున్నామన్నారు. మొత్తం రూ.430 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే 98శాతం పనులు కంప్లీట్ అయ్యాయని వివరించారు. నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు.
సికింద్రాబాద్‌కు తగ్గనున్న రద్దీ
చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్‌కు వచ్చే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గి ట్రాఫిక్ సమస్య తీరుతుంది. రైల్వే స్టేషన్లోఎగ్జిక్యూటివ్ లాంజ్, వెయిటింగ్ హాల్స్, టికెట్ బుకింగ్ కౌంటర్లు, ఈవీ ఛార్జింగ్ పాయింట్ల వంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పించాం. మొత్తం 19 లైన్లు ఉన్నాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెళ్లేందుకు కనెక్టివిటీ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. భరత్‌నగర్, మహాలక్ష్మి నగర్ వైపు 80 అడుగుల మేర రోడ్లు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి’’అని కిషన్ రెడ్డి కోరారు.
40 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు
రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, మూడు, నాలుగు వరుసల రైల్వే లైన్, ఎలక్ట్రిఫికేషన్ వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను డెవలప్ చేస్తున్నం. అత్యాధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను 2025 నాటికి పూర్తి చేస్తాం. దీని కోసం రూ.715 కోట్లు కేటాయించినం’’అని కిషన్ రెడ్డి తెలిపారు. కాగా, చర్లపల్లి రైల్వే టర్మినల్ ఉత్తరం వైపు80 ఫీట్ల రోడ్డు విస్తరణను వద్దంటూ మహాలక్ష్మినగర్ కాలనీవాసులు కిషన్ రెడ్డిని కలిసి తమ గోడును వెల్లడించారు. స్టేషన్ వెనుక అందుబాటులోని 3 రోడ్లను వినియోగించుకుంటే రోడ్డు విస్తరణ అవసరముండదని వినతి పత్రం సమర్పించారు.