ప్రకృతి, ప్రజల సమన్వయంతో సుస్థిర మైనింగ్‌‌‌‌ సాధ్యం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ప్రకృతి, ప్రజల సమన్వయంతో సుస్థిర మైనింగ్‌‌‌‌ సాధ్యం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌లో అంతర్జాతీయ సదస్సు 
  • రేర్​ ఎర్త్​ ఎలిమెంట్స్ ఉత్పత్తిలోకి సింగరేణి అడుగు

హైదరాబాద్, వెలుగు: ప్రకృతి, ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం ద్వారా సుస్థిర మైనింగ్ సాధ్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌‌‌‌లోని ట్రైడెంట్ హోటల్‌‌‌‌లో వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్ సదస్సులో ఆయన ప్రసంగించారు. బొగ్గు, అల్యూమినియం, రాగి వంటి ఖనిజాల ఉత్పత్తిని పెంచి దేశాన్ని స్వయంసమృద్ధి దిశగా నడిపించాలని, అదే సమయంలో పర్యావరణం, స్థానికులకు ఉపయోగపడే విధానాలు అవలంబించాలని సూచించారు. ప్రపంచవ్యాప్త సుస్థిర మైనింగ్ పద్ధతులను అర్థం చేసుకోవడంలో, మైనింగ్ రంగ సవాళ్లను పరిష్కరించడంలో ఈ సదస్సు కీలకమని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుందని.. బొగ్గు, ఇతర గనుల రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు ప్రపంచస్థాయి ఆలోచనలను అమలు చేయాలన్నారు. 

ప్రజలకు ఉపయోగపడేలా గనుల మూసివేత

బాధ్యతాయుత మైన్ క్లోజర్‌‌‌‌ కోసం సింగిల్ విండో సిస్టమ్‌‌‌‌ను ప్రవేశపెట్టినట్లు కిషన్​రెడ్డి తెలిపారు. స్పీడ్​గా పర్మిషన్లు, గనులకు భూములిచ్చే వారికి ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలు పెంచే చర్యలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నేషనల్ మినరల్ ఎక్స్‌‌‌‌ప్లొరేషన్ ట్రస్ట్ ద్వారా ఖనిజ అన్వేషణను ప్రోత్సాహిస్తున్నామని, ప్రైవేట్ సంస్థలను భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మైనింగ్ పూర్తయిన భూములను స్థానికులకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని ప్రధాని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి ‘మిషన్ గ్రీన్ బుక్’, ‘రిక్లెయిమ్’ పుస్తకాలను రిలీజ్ చేశారు. అన్వేషణ విభాగం కోసం సింగిల్ విండో విధానంతో రూపొందిన పోర్టల్‌‌‌‌ను, 24వ నైవేలి బుక్ ఫెయిర్ 2025ను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో 
ప్రారంభించారు.

ఎన్​ఎఫ్​టీడీసీతో సింగరేణి ఒప్పందం

సింగరేణి ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టేందుకు నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్‌‌‌‌మెంట్ సెంటర్(ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌టీడీసీ)తో ఒప్పందం కుదిరిందని కిషన్ రెడ్డి అన్నారు. కీలక ఖనిజ రంగంలోనూ సింగరేణి అగ్రగామిగా నిలవాలని పిలుపునిచ్చారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు, థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే ఫ్లై యాష్, బాటమ్ యాష్‌‌‌‌లో, ఖమ్మం జిల్లా గుట్టల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ మూలకాల వెలికితీత కోసం ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌టీడీసీతో చేసుకున్నామన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సూచనల మేరకు కీలక ఖనిజ రంగంలోకి అడుగుపెట్టేందుకు కన్సల్టెన్సీ ఏజెన్సీలను నియమించినట్లు సింగరేణి సీఎండీ  బలరామ్ తెలిపారు.