కేంద్రం విభజన హామీలు నెరవేర్చాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్

కేంద్రం విభజన హామీలు నెరవేర్చాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్
  • హస్తినలో తెలంగాణ భవన్ ఆలస్యమైంది: మంత్రి కోమటిరెడ్డి
  • భవన్ ఆస్తులపై అధికారులతో రివ్యూ, స్థలాల పరిశీలన

న్యూఢిల్లీ, వెలుగు : దేశ రాజధాని ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ ఆస్తుల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా 58:42 శాతంలో ఏపీ, తెలంగాణ మధ్య పంపకాలు ఉంటాయన్నారు. అయితే రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదిన్నర ఏండ్లు గడుస్తున్నా.. తెలంగాణకు ప్రత్యేక భవనం నిర్మించడంలో జాప్యం జరిగిందన్నారు. మంగళవారం ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. తొలుత ఉమ్మడి ఏపీ భవన్ ఆస్తులు, తెలంగాణకు ఉన్న వాటా సహా భవనాలు, ఖాళీ స్థలాల వివరాలను మ్యాప్ ద్వారా భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఆర్ అండ్ బీ అధికారులు మంత్రికి వివరించారు. భవన్ విభజనకు సంబంధించి పలుమార్లు కేంద్ర హోం శాఖ ఆధ్యర్వంలో జరిగిన భేటీలో ఏపీ సర్కార్ ప్రతిపాదనలు, తెలంగాణ గత ప్రభుత్వం ప్రపోజల్స్ వివరాలను మంత్రికి తెలిపారు. అనంతరం మంత్రి, అధికారులతో కలిసి.. గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్, పటౌడీ హౌజ్ గ్రౌండ్ ను పరిశీలించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ..19 ఎకరాల ఉమ్మడి ఏపీ భూమిలో తెలంగాణ భవన్ నిర్మాణానికి అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. తెలంగాణ వాటాగా రావాల్సిన ల్యాండ్, ఇతర భవనాలపై అధికారులు మ్యాప్ ద్వారా వివరించారన్నారు. బుధవారం ఢిల్లీ పర్యటనకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్తానని చెప్పారు. మార్చిలోపు తెలంగాణ భవన్ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని, వెంటనే డిజైన్లు ఖరారు చేసి, టెండర్లు పిలుస్తామన్నారు. ఏప్రిల్ నాటికి తెలంగాణ భవన్ నిర్మాణ పనులు చేపడతామన్నారు.

ఏపీ ప్రత్యేక హోదా కోసం  నా వంతు కృషి చేస్తా

ఏపీ విభజన చట్టం–2014లో రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించారని.. ప్రస్తుత ప్రధాని మోదీ ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు.

ఆస్పత్రిలో చేరిన కోమటిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: స్వల్ప అస్వస్థతతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్పత్రిలో చేరారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన చలి వాతావరణం కారణంగా.. గొంతు నొప్పి, చాతీ‌‌ ఇన్‌‌ఫెక్షన్‌‌కు గురయ్యారు. దీంతో యశోద ఆస్పత్రికి వెళ్లారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు మంత్రి ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.

ఎన్ హెచ్ఏఐ చైర్మన్ తో భేటీ

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న నేషనల్ హైవేలకు సంబంధించిన పలు అంశాలపై మంగళవారం ఢిల్లీలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఐదు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నాగ్ పూర్– విజయవాడ హైవే పనులకు భూసేకరణ, అటవీ అనుమతులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సంద్భంగా ఎన్ హెచ్ఏఐ చైర్మన్ కు మంత్రి తెలిపారు. రూ. 4 వేల కోట్లతో ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు131 కి.మీ. హైవేకు నిధులపై, రూ. 1000 కోట్లతో 25 కి.మీ. నల్గొండ బైపాస్ రోడ్డు మంజూరుపై కూడా మంత్రి చర్చించారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ల డీపీఆర్ లని సమర్పించాలని ఎన్ హెచ్ఏఐ చైర్మన్ సూచించారు. గతంలో ఎన్ హెచ్ఏఐ ఆమోదించి ప్రపోజల్స్ మేరకే ఖమ్మం, మహబూబ్ నగర్ బైపాస్ లను చేపట్టాలని మంత్రి కోరారు. హైదరాబాద్– విజయవాడ హైవే బ్లాక్ స్పాట్ ల కోసం టెండర్లు ప్రోగ్రెస్ లో ఉన్నాయని తెలిపారు. అలాగే మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ఎన్ హెచ్ 65పై 6 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేకు సంబంధించి తాత్కాలిక ప్రతిపాదనలకు ఎన్ హెచ్ఏఐ చైర్మన్ ఆమోదం తెలిపారని మంత్రి ఆఫీసు వెల్లడించింది.