హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో కంటి జబ్బులతో బాధపడేవారికి రాబోయే రోజుల్లో ప్రభుత్వం తరపున ఉచితంగా కంటి శస్త్రచికిత్స చేయించే అంశాన్ని పరిశీలిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ లో యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, శంకర నేత్రాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి చికిత్స కార్యక్రమానికి కోమటిరెడ్డి హాజరై మాట్లాడారు.
బిల్ గేట్స్, వారెన్ బఫెట్ లాంటి కుబేరులు తమ కుటుంబం జీవించడానికి సరిపడా నిధులు సమకూర్చి మిగతా ఆస్తిని చారిటీల కోసం కేటాయిస్తున్నారని, మన దేశంలో కూడా ధనవంతులంతా వారిని ఆదర్శంగా తీసుకొని సమాజ సేవకు ముందుకు రావాలని ఆయన కోరారు. కుటుంబం కోసం, పిల్లల కోసం కాకుండా సమాజానికి ఆస్తుల్ని పంచిపెట్టే గొప్ప సంస్కృతి రావాలని ఆకాంక్షించారు.
శంకర నేత్రాలయ సంస్థ దాదాపు 200 మందికి కంటి శస్త్రచికిత్స చేస్తున్నదని, ఇందులో క్రిటికల్ సమస్యలు ఉన్నవారిని చెన్నైలోని శంకర నేత్రాలయానికి తీసుకెళ్లి వైద్యం అందించడం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని మంత్రి కొనియాడారు.
ఇలాంటి సత్కార్యంలో తాను భాగం పంచుకోవాలని భావించి క్రిటికల్ పేషెంట్లు చెన్నై వెళ్లేందుకు, అక్కడ వసతికి, చికిత్స ఖర్చులకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ శ్రీనివాస్, అడ్వైజర్ ప్రదీప్, శంకర నేత్రాలయ ప్రతినిధి ఆరుల్ కుమార్ పాల్గొన్నారు.
