- సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాకే నిర్ణయం: మంత్రి వెంకట్ రెడ్డి
- మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుస్తామని వెల్లడి
చేవెళ్ల, వెలుగు: సినిమా టికెట్ల రేట్ల పెంపు తనకు తెలిసే జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పుష్ప సినిమా సమయంలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని టికెట్ రేట్లు పెంచబోమని చెప్పని మాట వాస్తవమేనని, దాన్ని సవరించి వచ్చిన ఆదాయంలో 20 శాతం కార్మికులకు ఇవ్వాలన్న కండీషన్ పై కొన్ని సినిమాలకు హైక్ ఇచ్చామని క్లారిటీ ఇచ్చారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మొయినాబాద్, చేవెళ్ల, శంకర్ పల్లి మున్సిపాలిటీల్లో రూ.45 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు, చందానగర్ నుంచి కవేలిగూడ వరకు రూ.30 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ, చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో 17.5 కోట్లతో వంద పడకల ఆస్పత్రి, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలో 2.42 కోట్లతో మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, అకామడేషన్ రూమ్స్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డిలా ఎవరి శాఖలో జోక్యం చేసుకోరన్నారు. కేసీఆర్ హయాంలో మంత్రులకు ఏ మాత్రం స్వేచ్ఛ ఉండేది కాదని విమర్శించారు. చేవెళ్ల నియోజకవర్గంలో ప్రతి రోడ్డును డబుల్ రోడ్డు చేయనున్నట్లు వివరించారు. బీజాపూర్ హైవే పనులు స్పీడప్ చేస్తున్నామని తెలిపారు.
నేను ఏ తప్పూ చేయలేదు
తనకు తెలిసి ఏ తప్పూ చేయలేదని, ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని మంత్రి వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబంలోనే ఎన్నో గొడవలు జరుతున్నాయని, వాళ్లు చేసిన అవినీతిని ఆయన కూతురు బయటపెడుతోందని విమర్శించారు. పదేండ్లు అధికారంలో ఉన్నా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఇండ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. సర్పంచ్ ఎన్నికల్లో తాము 70 శాతం స్థానాలు గెలిచామని, రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
