బీఆర్ఎస్‌ను ప్రజలు ఎప్పుడో బొంద పెట్టారు: మంత్రి వెంకట్‌రెడ్డి ఫైర్

బీఆర్ఎస్‌ను ప్రజలు ఎప్పుడో బొంద పెట్టారు: మంత్రి వెంకట్‌రెడ్డి ఫైర్

నల్గొండ, వెలుగు: ‘కేటీఆర్ ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు.. తండ్రి చాటు కొడుకు, ఆయనకు రాజకీయలపై అవగాహన లేదు, అందుకే ఇష్టం వచ్చినట్లు అర్థం లేని విమర్శలు చేస్తున్నారు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గురువారం నల్గొండ కలెక్టరేట్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు.

రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో అంచెలంచెలుగా సీఎం స్థాయికి ఎదిగారన్నారు. కేసీఆర్ దొంగ దీక్షలు చేసి తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజల త్యాగాలు చూసి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు బొంద పెట్టారన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి గుండు సున్నా వచ్చిందని, 11 స్థానాల్లో డిపాజిట్ దక్కలేదని ఎద్దేవా చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్‌ను దేశానికి రప్పిస్తున్నారని, వారు వచ్చాక బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ పరారవుతారన్నారు. కేసీఆర్, కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ లీడర్లు జైలుకెళ్లక తప్పదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జగదీశ్‌రెడ్డి వేల కోట్లకు పడగెత్తాడని విమర్శించారు. కేటీఆర్ సూర్యాపేటకు వచ్చుడు దండగని, ఆ పార్టీ ఎప్పుడో ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు.

కాంగ్రెస్‌ సెక్యులర్‌ పార్టీ అని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్‌ ఫ్యామిలీకి తప్ప ఎవరికీ పదవులు రాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని, గత సర్కారు పట్టించుకోని ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేస్తుందని గుర్తు చేశారు.