
కేసీఆర్ ఫ్యామిలీకి మంత్రి కోమటిరెడ్డి హితవు
రూ.7 లక్షల కోట్లు అప్పుచేసి నాసిరకం ప్రాజెక్టు కట్టారని ఫైర్
వచ్చే నెల నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ
నల్గొండ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాని సంపాదించిన దాంతో ఏదో ఒక దేశం పోయి బతికితే మంచిదని కేసీఆర్ ఫ్యామిలీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హితవు పలికారు. గజ్వేల్, సిరిసిల్లలో ఓడిపోయిన వాళ్లు రాష్ట్రంలో దుకాణం బంద్ చేసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. ఆదివారం నల్గొండలో మీడియాతో మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం పేరుతో రూ.2 లక్షల కోట్ల అప్పుతెచ్చి నాసిరకం ప్రాజెక్టు కట్టారని కేసీఆర్ పై ఆయన ఫైర్ అయ్యారు. గోదావరి వరదకు బ్యారేజీ బీటలు బారుతోందని విమర్శించారు.
ఆగస్టు నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నిరుడు రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఈసారి అలాంటి పరిస్థితులు రావొద్దని దేవుడిని కోరుకున్నానని మంత్రి తెలిపారు. హైదరాబాద్–- విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించే పనులను సెప్టెంబరులో ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకు ఆగస్టులో టెండర్లు పిలుస్తామని, ఈ విషయమై సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మరోసారి భేటీ అవుతానని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, త్వరలో కేబినెట్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.