టిమ్స్ హాస్పిటల్స్ పనులు స్పీడప్ చేయండి : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

టిమ్స్ హాస్పిటల్స్ పనులు స్పీడప్ చేయండి : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  • నిర్మాణ కంపెనీలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆదేశం
  • ఆగస్టు చివరికి సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్​ పూర్తి 
  • పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుంది
  • ఉస్మానియా డీపీఆర్​పై సీఎంతో చర్చిస్తానని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ జంట నగరాల్లో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్స్ పనులు స్పీడప్​ చేయాలని నిర్మాణ కంపెనీలను ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆదేశించారు. ఈ హాస్పిటల్స్ పూర్తయితే పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందని, పేద, మధ్య తరగతి ప్రజలపై ఫీజుల భారం తగ్గడంతోపాటు నిమ్స్, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ కు రోగుల తాకిడి తగ్గుతుందన్నారు. మంగళవారం సెక్రటేరియెట్ లో   ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ హరిచందన, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తు, టిమ్స్ హాస్పిటల్స్ కాంట్రాక్టర్లు, కంపెనీల ప్రతినిధులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. పేదల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, హాస్పిటల్స్ నిర్మాణంలో ఆలస్యం, అలసత్వం, క్వాలిటీలో రాజీ పడకూడదన్నారు.

 ఉస్మానియా కొత్త బిల్డింగ్ డీపీఆర్​పై త్వరలో సీఎంతో చర్చించి, తర్వాత కేబినెట్​లో ఆమోదిస్తామని వెల్లడించారు.  ఆస్పత్రులన్నీ సూపర్ స్పెషాలిటీ హంగులతో నిర్మిస్తుండడం.. అధునాతన వైద్య పరికరాలతో పాటు ఆధునిక ఆపరేషన్ థియేటర్ల నిర్మాణం.. ఈ సూపర్ స్పెషాలిటీ ఎక్విప్ మెంట్ అంతా  బయట దేశాలనుంచి రావాల్సి ఉండడంతో నిర్మాణం కొంత ఆలస్యమవుతున్నదని చెప్పారు. సనత్ నగర్ ఆస్పత్రి పనులు ఆగస్టు నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం ఉందని, ఎల్బీనగర్, అల్వాల్ ఆస్పత్రులు కూడా వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. సనత్ నగర్ టిమ్స్ ను  జూన్ 2 న ఓపెన్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఇపుడు మరో 3 నెలలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సాంకేతిక అంశాలతో కూడిన పూర్తిస్థాయి రిపోర్టు అందించాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.