
హైదరాబాద్: జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC)తో జరిగిన చర్చలు విఫలం కావడంతో కార్మికుల యధావిధిగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సినీ కార్మికుల ఆందోళనపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. సినీ కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని.. రోజురోజుకు పెరిగిపోతున్న జీవన వ్యయాలతో హైదరాబాదులో బతకాలంటే కార్మికుల జీతాలు పెంచక తప్పదన్నారు.
ఢిల్లీ పర్యటన తర్వాత సినీ కార్మికులతో భేటీ అవుతానని చెప్పారు. సినీ కార్మికుల ఆందోళన, జీతాల పెంపుకు సంబంధించిన అంశాలన్నింటినీ తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్, నిర్మాత దిల్ రాజ్‌కు అప్పగించామని.. వీటిపై ఆయన చర్చిస్తున్నారని తెలిపారు. కార్మికుల డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని సినీ పెద్దలకు సూచించారు.
కాగా, తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న కార్మికుల సమ్మె రోజురోజుకు తీవ్రమవుతోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ అసోసియేషన్ (TFIEMAF), తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలు విఫలం కావడంతో, సమస్య మరింత జఠిలమవుతోంది. దీనివల్ల పలు పెద్ద, చిన్న చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయి, సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు.