
చిట్యాల, వెలుగు: తన ఊపిరి ఉన్నంత వరకు ట్రిపుల్ ఆర్ రైతులకు అన్యాయం జరగనివ్వనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపట్టి గ్రామ శివారులోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. 2017–18లో ప్రధాని మోదీ నార్త్ వింగ్ రీజినల్ రింగ్ రోడ్డుకు అంగీకరిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఎంపీగా రైతులకు అన్యాయం జరగకుండా ధర్నాలో పాల్గొన్నానని, ప్రజా ప్రభుత్వం వచ్చాక మార్కెట్ రేట్ ఇప్పించి రైతులను ఒప్పించానని తెలిపారు. 2035 నాటికి ట్రాఫిక్ పెరుగుతుందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా 6 లేన్లుగా మార్చుకున్నామని తెలిపారు.
సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవపూర్ వయా భువనగిరి, చౌటుప్పల్ వరకు 161.518 కిలో మీటర్లు నార్త్ పార్ట్ ఉంటుందని చెప్పారు. భూసేకరణ కోసం రూ.6 వేల కోట్లు ఖర్చవుతున్నాయని తెలిపారు. నార్త్ సైడ్ అలైన్మెంట్ లో ఎలాంటి మార్పు ఉండదని, జనవరిలో పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అందుకు కేంద్రం సహకరించాలని కోరారు. సౌత్ వింగ్ విషయంలో రైతులు అనవసరంగా ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. తాను రైతు బిడ్డనేనని, రైతుకు అన్యాయం జరిగితే ఊరుకుంటానా? అని ప్రశ్నించారు. త్వరలో సీఎంతో మాట్లాడి మంత్రుల కమిటీ వేస్తామని తనను కలిసిన రైతులకు హామీ ఇచ్చారు. వైఎస్సార్ హయాంలో కట్టిన ఓఆర్ఆర్ ను రూ.7వేల కోట్లకు అమ్ముకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను రెచ్చగొట్టేందుకు యత్నిస్తుందని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కందిమల్ల శిశుపాల్ రెడ్డి, ఆవుల ఐలయ్య పాల్గొనారు.