మంత్రి పదవి ఇప్పించే స్థాయిలో నేను లేను.. అంతా హైకమాండే చూసుకుంటది: మంత్రి కోమటిరెడ్డి

మంత్రి పదవి ఇప్పించే స్థాయిలో నేను లేను.. అంతా హైకమాండే చూసుకుంటది: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే, తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (ఆగస్ట్ 5) ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే, ఇప్పించే స్థాయిలో తాను లేనని.. అంతా పార్టీ హైకమాండ్, రాష్ట్ర నాయకత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. పదవుల కేటాయింపుపై హైకమాండ్ సీఎం, పీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకుంటుందని తేల్చి చెప్పారు. నేనే కాదు, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేమని కుండబద్దలు కొట్టారు. కేబినెట్‎లో నేను ఒక సీనియర్ మంత్రిని మాత్రమేనని అన్నారు. మంత్రి పదవి ఇస్తామని రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చిన విషయం తనకు తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. 

అంతకముందు మనుగోడు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పదవిపై హాట్ కామెంట్స్ చేశారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికైనా సిద్ధమేనని.. అవసరమైతే మునుగోడుకు మళ్లీ ఉప ఎన్నిక తెస్తానని అన్నారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిత్వం నాది కాదని.. నాలాంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తే ప్రజలకే మేలన్నారు. నేను ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నానని అంటున్నారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం చెప్పినా కూడా మునుగోడు ప్రజల కోసం ఇక్కడ నుండే పోటీ చేశానని చెప్పారు. 

పదవిని అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించే వాడికి పదవి కావాలి కానీ.. నాలాంటి వారికి ప్రజలే ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడే తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని.. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల సమయంలోనూ అలాంటి హామీనే ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు గుర్తు చేశారు రాజగోపాల్ రెడ్డి. పదవి ఇస్తారా.. ఇవ్వరా అనేది మీ ఇష్టం.. సీనియర్ నేతనే కాబట్టి మంత్రి పదవి ఆశించడంలో తప్పులేదంటూ మనసులో ఉన్నది ఓపెన్‎గా చెప్పారు ఈ మునుగోడు ఎమ్మెల్యే.

మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసిన వెంటనే ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి తమ్ముడి వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. తన చేతిలో ఏమి లేదని కుండబద్దలు కొట్టారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యాఖ్యలు అధికార పార్టీతో పాటు స్టేట్ పొలిటికల్ సర్కి్ల్స్‎లో చర్చనీయాంశంగా మారాయి.