రాష్ట్రానికి తలమానికంగా నర్సాపూర్ ఎకో పార్క్ : మంత్రి కొండా సురేఖ

రాష్ట్రానికి తలమానికంగా నర్సాపూర్ ఎకో పార్క్ : మంత్రి కొండా సురేఖ
  • మంత్రి కొండా సురేఖ

నర్సాపూర్, వెలుగు: ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న నర్సాపూర్  ఎకో పార్క్  రాష్ట్ర పర్యాటకరంగానికి తలమానికంగా నిలుస్తుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. మెదక్  జిల్లా నర్సాపూర్  అడవిలో అభివృద్ధి చేసిన ఎకో పార్క్‌, కాటేజీలను  శనివారం మెదక్  ఎంపీ రఘునందన్ రావు, నర్సాపూర్  ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ఎకో పార్క్  వంటి ప్రాజెక్టులు కొత్త తరానికి స్ఫూర్తినిస్తాయని, పార్కులో అరుదైన మొక్కలు, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని తెలిపారు. పార్కులో ఏర్పాటు చేసిన వేదికలు, లగ్జరీ సదుపాయాలు, పిక్నిక్  స్పాట్స్, ఈవెంట్స్  నిర్వహించుకునేందుకు అవసరమైన సౌలతులు, పచ్చదనం లాంటివి సందర్శకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. 

పర్యావరణాన్ని ఆస్వాదించాలనుకునే వారు తప్పకుండా సందర్శించాల్సిన పార్కుగా ఇది రూపుదిద్దుకుందని తెలిపారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఎకో పార్కు సమీపంలోని చెరువు డంపింగ్ యార్డ్  కాకుండా చూడాలని, ప్రకృతిని ప్రేమించాలని, కాలుష్యం తగ్గించాలని, పార్కు నిర్వాహకులకు సూచించారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్  నియోజకవర్గానికి అడవి వరం అని పేర్కొన్నారు. హైదరాబాద్  మేయర్  విజయలక్ష్మి, పర్యావరణం శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ అహ్మద్ నదీం, పీసీసీఎఫ్​ సువర్ణ, చార్మినార్​ జోన్​ చీఫ్ కన్జర్వేటర్​ ప్రియాంక వర్గీస్, కలెక్టర్ రాహుల్ రాజ్, మృగవని రిసార్ట్స్  ఎండీ విష్ణు చైతన్య రెడ్డి, డీఎఫ్​వో జోజీ, ఎఫ్ఆర్వో అరవింద్  పాల్గొన్నారు.