- పట్టా పాస్‍బుక్ తీసుకొస్తేనే ఆన్‍లైన్ లో పత్తి కొనుగోలు
- మార్కెట్ లో తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
- రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
వరంగల్, వెలుగు : రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకుంటే ఐదు రోజుల్లోనే అకౌంట్లలోకి పైసలు జమ అవుతాయని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి మంచి ధరను పొందాలని సూచించారు. సోమవారం వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో సీసీఐ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
బీఆర్‍ఎస్ పాలనలో రైతులకు చేసిందేమిలేదని, వరి వేస్తే ఉరి అంటూ ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. రైతులు పట్టా పాస్‍బుక్ తీసుకొస్తేనే ఆన్‍లైన్ లో పత్తి కొనుగోలు చేస్తామని చెబుతూ, తేమ 8 శాతం మించకుండా ఇంటివద్దే ఆరబెట్టి తీసుకురావాలని, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు సూచించారు.
రైతులకు ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 18005995779, వాట్సాప్ నంబర్ 8897281111 కు కాల్ చేసి చెప్పాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో విజయలక్ష్మి, సీసీఐ జనరల్ మేనేజర్ మోహిత్ శర్మ, మార్కెటింగ్ శాఖ డీడీ పద్మావతి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, డీసీఓ నీరజ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్‍రెడ్డి అధికారులు పాల్గొన్నారు.
