రూ.8 కోట్లతో ఎంజీఎం అభివృద్ధి..అవినీతికి పాల్పడితే చర్యలు: మంత్రి కొండా సురేఖ

రూ.8 కోట్లతో ఎంజీఎం అభివృద్ధి..అవినీతికి పాల్పడితే చర్యలు: మంత్రి కొండా సురేఖ
 

కాశీబుగ్గ/వరంగల్‌‌‌‌‌‌‌‌సిటీ, వెలుగు : వరంగల్‌‌‌‌‌‌‌‌లోని ఎంజీఎం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను రూ. 8 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సత్యశారద అధ్యక్షతన వరంగల్‌‌‌‌‌‌‌‌ ఎంజీఎం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అధ్వానంగా మారిందని, డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేదల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌గా పేరుగాంచిన ఎంజీఎంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది కొరత ఉందని, ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. 

ప్రతి మూడు నెలలకు ఓసారి సమావేశం నిర్వహించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో పరికరాల కొరత ఉందని, ఆరోగ్య శ్రీ నిధులతో పరికరాలు కొనుగోలు చేసి చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పరికరాలు పెద్ద ఎత్తున అవసరం ఉంటే డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ మెడికల్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లతో పాటు ప్రభుత్వానికి విన్నవించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి పనులు, వైద్య సేవలు నాణ్యత, మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కు దీటుగా వైద్యం అందించేందుకు డాక్టర్లతో పాటు సిబ్బంది కూడా శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి కోసం వరంగల్‌‌‌‌‌‌‌‌ ఎంపీ కడియం కావ్య రూ. 50 లక్షలు, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు రూ. 50 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్‌‌‌‌‌‌‌‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ హరీశ్‌‌‌‌‌‌‌‌ చంద్రారెడ్డి పాల్గొన్నారు.