పదేండ్లుగా నిద్రపోతున్న దేవాదాయ శాఖను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నం : మంత్రి కొండా సురేఖ

 పదేండ్లుగా నిద్రపోతున్న దేవాదాయ శాఖను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నం : మంత్రి కొండా సురేఖ
  • అన్యాక్రాంతమైన భూములను పరిరక్షిస్తున్నం : మంత్రి కొండా సురేఖ

బషీర్​బాగ్, వెలుగు: గత పదేండ్లుగా నిద్రపోతున్న దేవాదాయ శాఖను అభివృద్ధి దిశగా నడిపిస్తూ, అన్యాక్రాంతమైన భూములను పరిరక్షిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో  తలపెట్టిన పంచకుండాత్మక చండీ కుబేర పాశుపత యాగాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. లోక కల్యాణం కోసం కాచిగూడలోని తుల్జా భవాని ఆశ్రమంలో ఈ యాగాన్ని అర్చకులు చేపట్టడం అభినందనీయమన్నారు.

 ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దౌలతబాదు వాసుదేవ శర్మ , ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణితో కలిసి మంత్రి మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురావడానికి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండేందుకు ఇలాంటి యాగాలు ఎంతో అవసరమన్నారు. రాజశేఖర్ రెడ్డి ధూప దీప నైవేద్య కోసం అర్చకులకు ఆర్థిక సహాయాన్ని ప్రారంభించారని... ఇప్పుడు అనేక గుళ్లను ఎంపిక చేసి రూ.10  వేలు సహాయాన్ని అందజేస్తున్నామన్నారు. అయితే, దానిని రూ.30 వేలకు పెంచాలని అర్చకులు కోరుతున్నారని, సీఎం దృష్టికి తీసుకెళ్లి అమలు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.