
- ఫారెస్ట్ అధికారులకు అవార్డులు అందించేలా కృషి
- అటవీ శాఖ అసోసియేషన్ సమావేశంలో మంత్రి సురేఖ
హైదరాబాద్, వెలుగు: అటవీ అధికారులు, సిబ్బందిపై దాడి చేస్తే పీడీ యాక్టులు నమోదు చేస్తామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. మంగళవారం సెక్రటేరియెట్ లో రాష్ట్ర అటవీ శాఖ అధికారుల అసోసియేషన్తో మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రిన్స్ పల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, సునీత భగవత్ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఫారెస్టు సిబ్బందికి అండగా ఉంటామన్నారు.
చిన్న సమస్యలను శాఖాపరంగా పరిష్కరించుకుందామని తెలిపారు. కీలక అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని పేర్కొన్నారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. పోలీసులకు ఎటువంటి జీతాభత్యాలు ఇస్తున్నారో.. అటవీ అధికారులకూ అదే స్థాయిలో ఇచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అటవీ అధికారులకు అవార్డులు ఇచ్చేవారని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నిలిపివేశారన్నారు. ఇటీవల జరిగిన అటవీ శాఖ రివ్యూలో ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లానని, దీనికి ఆయన సుముఖత వ్యక్తం చేశారన్నారు.
దీంతో అటవీ అధికారుల అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, అటవీ భూములను అన్యాక్రాంతం చేసేవారిని మహారాష్ట్ర మాదిరిగా కఠిన చట్టాలతో శిక్షించాలని, అటవీ శాఖ బీట్ అధికారుల నియామకం వెంటనే చేపట్టాలని అసోసియేషన్ నాయకులు మంత్రిని కోరారు. ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ల జోన్ పోస్టును డిస్ట్రిక్ లెవెల్ పోస్టుగా మార్చాలన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు బీట్, సెక్షన్, డీఆర్ఓలకు ద్విచక్ర వాహనాలు అందించాలన్నారు. యంగ్ ఇండియా స్కూల్లో పోలీసు సిబ్బంది పిల్లలకు అడ్మిషన్స్ ఇచ్చినట్లే ఫారెస్టు అధికారులకు పిల్లలకు ఇవ్వాలని కోరారు.