
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ను మళ్లీ గెలిపించాలని, మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలనూ అమలు చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్అన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యాక సౌభాగ్యలక్ష్మి పథకం కింద 18 ఏండ్లు నిండిన మహిళలకు నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ బీజేపీ నాయకుడు గోవర్ధన్, హిమాయత్‌నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి, తదితరులు బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ను మళ్లీ గెలిపిస్తే తెల్ల రేషన్‌కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామన్నారు. మేనిఫెస్టోలో అనేక సంక్షేమ పథకాలు ప్రకటించామని.. పింఛన్లు, రైతుబంధు పెంపు సహా అన్ని హామీలనూ అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ నగరం న్యూయార్క్, దుబాయ్‌ని మించిపోయేలా అభివృద్ధి చెందిందని సినీ ప్రముఖులు రజనీకాంత్, సన్నీ డియోల్, లయ వంటి వారు ఎంతో మంది మెచ్చుకున్నారన్నారు.
దుబాయ్ కంటే హైదరాబాదే బాగుందని గంగవ్వ సైతం చెప్పిందని.. ఈ విషయం కాంగ్రెస్, బీజేపీ నాయకులకు మాత్రం తెలియడంలేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, నాయకులు కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.