‘వ‌ర‌ద బాధితుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది’

‘వ‌ర‌ద బాధితుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది’

హైద‌రాబాద్: మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున వర్షం ప్రభావిత ప్రజలంతా జిహెచ్ఎంసి ఏర్పాటుచేసిన సెంటర్లలో ఉండాలని సూచించారు మంత్రి కేటీఆర్. అక్కడ అన్ని ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. వర్షం కొంత తెరిపి ఇచ్చిన తర్వాత ప్రజలకు అవసరమైన అన్ని విషయాల్లో వారికి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న నగర ప్రజల్లో భరోసా నింపేందుకు మంత్రి కేటీఆర్ నగరంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించేందుకు పర్యటించారు. ఉదయమే జిహెచ్ఎంసి కార్యాలయానికి చేరుకున్న మంత్రి కే తారకరామారావు అక్కడి నుంచి అధికారులు అందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి తలసాని, ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను అంచనా వేశారు. రోజంతా నగరంలోని పలు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. మంత్రితో పాటు హోంమంత్రి మ‌హ‌మ్మ‌ద్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి, నగర పోలీస్ కమిషనర్ లు, జిహెచ్ఎంసి కమిషనర్ ఉన్నతాధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. ఎల్బీనగర్,ఉప్పల్ ,మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, సంతోష్ నగర్, ఫలక్‌నుమా వంటి ప్రాంతాల్లో అనేక కాలనీలను మంత్రి బృందం పరిశీలించింది. నగర వ్యాప్తంగా పలు కాలనీలను పరిశీలించిన మంత్రి.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేశారు. వర్షం ప్రభావిత కాలనీలోని ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా భరోసా ఇచ్చారు.