
2028 నాటికి లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం విలువను రెట్టింపు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 4 లక్షల ఉద్యోగాలను రెట్టింపు చేసి.. 8 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. బయో ఆసియా సదస్సు నేపథ్యంలో కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. బయో ఆసియా ప్రాముఖ్యతతో పాటు జీవశాస్త్ర, ఫార్మా రంగాల వృద్ధికి.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపట్టనున్న చర్యల గురించి ఆయన వివరణ ఇచ్చారు. ఇప్పటివరకు 19 సదస్సులను పూర్తి చేసుకుని ఈసారి ప్రతిష్టాత్మకమైన 20వ సదస్సును నిర్వహించుకోబోతున్నామని తెలిపారు. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు బయో ఆసియా సదస్సు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
అడ్వాన్సింగ్ ఫర్ వన్: షషేపిగ్ నెక్ట్స్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్ అన్న ఇతివృత్తంతో 20వ బయో ఆసియా సదస్సు జరగనుందని కేటీఆర్ తెలిపారు. గత 19 సంవత్సరాల్లో సుమారు రూ.24 వేల కోట్ల పెట్టుబడులను బయో ఏషియా రాష్ట్రానికి తీసుకువచ్చిందని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడుల్లో కొన్ని ఆంధ్రప్రదేశ్‌కూ వెళ్లాయని ఆయన గుర్తు చేశారు. భారతదేశ లైఫ్ సైన్సెస్ రంగానికి బయో ఏసియా విస్తృతమైన సేవలను అందించిందని చెప్పారు. దేశ లైఫ్ సైన్సెస్ రంగంలోని అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ సదస్సు విజయం సాధించిందని కేసీఆర్ అన్నారు. వందకు పైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నోబెల్ అవార్డు గ్రహీతలకు ఆతిథ్యం ఇవ్వగలిగామని, 20 వేలకుపైగా భాగస్వామ్య చర్చలు,30 పాలసీ పేపర్లు, సిఫార్సులను ఈ సదస్సు అందించిందని తెలిపారు. 100 దేశాలు ఇప్పటిదాకా ఈ సదస్సులో పాల్గొన్నాయని చెప్పారు. గత 20 సంవత్సరాలలో 250 కి పైగా అవగాహన ఒప్పందాలను ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవడంలో ఈ సదస్సు భాగస్వామిగా ఉందన్నారు. ఇప్పటికే అనేక దేశాలు భాగస్వామ్య కంట్రీల హోదాలో ఏషియాలో పాల్గొన్నాయని అన్నారు. ఈసారి కూడా పలు దేశాలు బయోఏషియాతో భాగస్వామ్య దేశం హోదాలో పాల్గొంటున్నాయని కేటీఆర్ తెలిపారు. తొలిసారి ఆపిల్ కంపెనీ కూడా పాల్గొంటోందని ఆయన స్పష్టం చేశారు.
భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు ప్రబలితే ఆదుకోగల స్థాయిలో హైదరాబాద్ ఫార్మాసిటీ ఉండబోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. జీవశాస్త్ర రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం.. ఫార్మాసిటీ ఏర్పాటుతో మరింత ఎత్తుకు ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ విషయంలో కోర్టుల్లో ఉన్న కేసులపై విచారణ ముగిసిందన్న ఆయన.. న్యాయమూర్తులు రిజర్వ్ చేసిన తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచంలోనే అతి కీలకమైన కేంద్రంగా మారిందని, ఏటా 900 కోట్ల టీకాలు తయారు చేస్తోందని మంత్రి చెప్పారు. త్వరలోనే ఈ సంఖ్య 1400 కోట్లకు చేరుతుందని, టీకాలన్నింటిలో తెలంగాణ వాటా 50 శాతానికి చేరుతుందని కేటీఆర్ తెలిపారు.