హుజూర్ నగర్ ఉప ఎన్నిక సర్వేలో 54.6 శాతం టిఆర్ఎస్ కే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక సర్వేలో 54.6 శాతం టిఆర్ఎస్ కే

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తెరాస పార్టీ బుధవారం హుజూర్ నగర్ ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించింది. సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.

హుజూర్ నగర్ ఎన్నికలపై తమ పార్టీ నాయకులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని, తాజా సర్వే ప్రకారం 11 శాతం తేడా తో తామే ముందున్నామని కేటీఆర్ అన్నారు. హుజూర్ నగర్ లో తొలిసారి టిఆర్ ఎస్ జెండా ఎగురవేయ్యబోతున్నామని ఆయన అన్నారు. సర్వేలో 54.6 శాతం తమకే అనుకూలంగా ఉందని , 42 శాతంతో కాంగ్రెస్,  2.55 శాతంతో బీజేపీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయన్నారు.

హుజూర్ నగర్ లో బీజేపీ లేదన్న కేటీఆర్.. సర్వే ప్రకారం బీజేపీ తమకు కనుచూపు మేరలో కూడా లేదని ఎద్దేవా చేశారు. కేవలం మోడీ ఇంపాక్ట్ తోనే ఆ పార్టీ నాలుగు ఎంపీ సీట్లు గెలిచిందన్నారు. 16 సీట్లు గెలుస్తామని ఆశించడంలో తప్పు లేదని, కాని నిజం మాత్రం.. ఆ పార్టీ మూడవ స్థానంతో సరిపెట్టుకుంటుందని కేటీఆర్ అన్నారు.

“ కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కు లాభం..టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్ నగర్ కి లాభం“ ఈ ఎన్నికలో ఇదే తమ నినాదమన్నారు. బూత్ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ.. ప్రతీ గడప గడపకి ప్రచారం చేస్తామని కేటీఆర్ చెప్పారు. ప్రచారంలో భాగంగా సీఎం సభ కూడా ఉంటుందని.. కేసీఆర్ రంగంలో దిగాక సీన్ ఇంకా  మారుతుందని ఆయన అన్నారు. రేపటి నుండి ప్రచారం ఉదృతం చేస్తామన్నారు. తాము ఎంత మెజారిటీతో గెలుస్తామనేది వచ్చే నెల 24న చెప్తానని ఆయన అన్నారు.

తమ అభ్యర్థి సైది రెడ్డికి నియోజకవర్గంలో సానుభూతి ఉందని..మంచి మెజారిటి తో గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగులేదని…హుజుర్నగర్ లో అన్ని తమకు కలిసొచ్చె అంశాలే ఉన్నాయన్నారు. తమ పోటీ కాంగ్రెస్ తోనే అని ఆయన అన్నారు. ఉప ఎన్నిక తరువాత నామినేటెడ్ పోస్టులు ఉండే అవకాశముందని…మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా మంత్రులు, ఎమ్మెల్యేలకు హుజుర్నగర్ బాధ్యతలు అప్పగించలేదని మంత్రి చెప్పారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున తమ దృష్టి అంతా మున్సిపల్ ఎన్నికల పైనే ఉందని కేటీఆర్ అన్నారు.