రైతుల పాలిట కాంగ్రెస్ విలన్ .. నీళ్లు, కరెంట్ కూడా ఆపాలంటరేమో: కేటీఆర్

రైతుల పాలిట కాంగ్రెస్ విలన్ .. నీళ్లు, కరెంట్ కూడా ఆపాలంటరేమో: కేటీఆర్

 

  • కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దహనం చేయండి 
  • ఊరూరా ఆందోళనలు చేయాలని క్యాడర్ కు పిలుపు

హైదరాబాద్, వెలుగు: రైతుబంధు సాయం ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్.. రైతుల పాలిట విలన్​అని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​అన్నారు. ఆ పార్టీ రైతు విరోధి అని మరోసారి రుజువైందని మండిపడ్డారు. ‘‘ఇంటింటికీ మంచినీళ్లు. ఇరవై నాలుగు గంటల కరెంట్​లోనూ కేసీఆర్ కనిపిస్తడు కదా! కాంగ్రెసోళ్లు వాటిని కూడా ఆపెయ్యమంటారేమో” అని విమర్శించారు. ఈ మేరకు గురువారం కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘అన్నదాతల పాలిట నంబర్​వన్​విలన్​కాంగ్రెస్​అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్​కుట్రను తెలంగాణ రైతులు సహించబోరు. అన్నదాతల పొట్టకొట్టే కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతులు భరించరు. రైతుబంధు ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆ పార్టీని నమ్మి ఓటేసిన పాపానికి కర్నాటక రైతులను అరిగోస పెడుతున్నారని, తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారని మండిపడ్డారు. రైతుబంధు పథకానికి పాతరేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 

ఆందోళనలకు పిలుపు.. 

రైతుబంధుపై కాంగ్రెస్​తీరును ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్​పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్​నుంచి ఎమ్మెల్యేలు, ఎలక్షన్​ఇన్​చార్జులు, ముఖ్య నాయకులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్​నిర్వహించారు. ‘‘కాంగ్రెస్​పార్టీ రైతు వ్యతిరేక వైఖరిపై ప్రతి నియోజకవర్గం, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో ఎక్కడికక్కడ నిరసనలు తెలపండి. కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దహనం చేయండి. ఇతర రూపాల్లోనూ నిరసనలు తెలియజేయండి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, సీనియర్​నాయకులు ఎక్కడికక్కడ ప్రెస్​మీట్లు పెట్టి కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టాలి” అని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ మేనిఫెస్టోను కేసీఆర్ భరోసా పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.