ఒక్కసారి తప్పు చేస్తే 50 ఏండ్లు వెనక్కిపోతం : కేటీఆర్

ఒక్కసారి తప్పు చేస్తే 50 ఏండ్లు వెనక్కిపోతం : కేటీఆర్
  •     డిసెంబర్​3 తర్వాత కొత్త రేషన్​కార్డులు, అసైన్డ్​ భూములకు పట్టాలు ఇస్తం
  •     దౌల్తాబాద్ సభలో మంత్రి కేటీఆర్

దుబ్బాక/తొగుట, వెలుగు :  డిసెంబర్ 3 బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములన్నింటికి  పట్టాలు ఇస్తామని, జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్​లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఓటర్లు విచక్షణతో ఓటు వేయాలని, ఒక్క సారి తప్పు చేస్తే యాభై ఏండ్లు వెనక్కి పోతామని హెచ్చరించారు. 50 ఏండ్లు పాలించి ఏమీ చేయని కాంగ్రెస్ ఇప్పుడొచ్చి ఒక్క చాన్స్ ఇవ్వమని అడుగుతున్నదని విమర్శించారు.

రైతుబంధు దండుగ అంటున్న కాంగ్రెస్ కావాల్నా.. రైతులను ఆదుకుంటున్న బీఆర్ఎస్ కావాల్నో తేల్చుకోవాలని అన్నారు. పీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందంటున్నారని, ఆ పార్టీ వస్తే కరెంట్ ఉండదన్నారు. ధరణి రద్దు చేస్తే రైతులకు పాత కష్టాలు తప్పవన్నారు. 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన తరువాత ఎట్లా మారిందో గమనించాలన్నారు. ఈ ఎన్నికల్లో దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డే గెలుస్తారని, రఘునందన్ రావు ఇక ఇంటికేనని అన్నారు.

కత్తిపోట్ల రాజకీయానికి వ్యతిరేకంగా ఓటు పోటు పొడవాలని, ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉపఎన్నికల్లో కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెస్తానని చెప్పి రఘునందన్ రావు వెయ్యి ఓట్ల తేడాతో గెలిచాడని, నిధులు తెచ్చిండా అని ప్రశ్నించారు. బీజేపీకి ఢిల్లీ నుంచి, కాంగ్రెస్ కు కర్నాటక నుంచి డబ్బులు వస్తున్నాయని ఆరోపించారు.

ఢిల్లీ నుంచి ఎంతమంది తీస్మార్ ఖాన్​లు వచ్చినా గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్డుడేనని అన్నారు. కేసీఆర్​ను మూడో సారి సీఎంగా చేసుకోవాలన్నారు. ఈ సభలో  ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ పాల్గొన్నారు.