వరంగల్ ​వస్తున్న మోదీని నిలదీయాలి : మంత్రి కేటీఆర్

వరంగల్ ​వస్తున్న మోదీని నిలదీయాలి : మంత్రి కేటీఆర్
  • విభజన హామీలను పట్టించుకుంటలేరు: కేటీఆర్​
  • కోచ్​ ఫ్యాక్టరీ అని చెప్పి బోగీల రిపేర్ షెడ్డు ఇస్తున్నరు
  • ట్రైబల్​ వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇంకా రాలె
  • ఓట్ల కోసం కాంగ్రెస్​ దిగజారుడు హామీలు ఇస్తున్నదని విమర్శ

మహబూబాబాద్, వెలుగు: ఈ నెల 8న వరంగల్ జిల్లాకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు నిలదీయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించాలని చెప్పారు. శుక్రవారం మహబూబాబాద్​లోని ఎన్​టీఆర్​స్టేడియంలో రైతులకు ఆయన పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్​మాట్లాడుతూ, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 360 ఎకరాల భూమి కేటాయించినప్పటికీ యూనివర్సిటీని మంజూరు చేయడం లేదని విమర్శించారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని హామీ ఇచ్చి తొమ్మిదేండ్లయినా ఆ ఊసేలేదన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్రం రైల్వే బోగీల రిపేర్ షెడ్ ను ఏర్పాటు చేస్తామనడం దారుణమన్నారు. కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్​కు తరలించుకుపోయారని, రూ.21 వేల కోట్లతో అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారన్నారు.

అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని

ఎన్ని అడ్డదారులు తొక్కి అయినా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నాయకులు కలలు కంటున్నారని కేటీఆర్​ధ్వజమెత్తారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారన్నారు. చందమామను తీసుకువస్తామని వాళ్లు ప్రకటించినా ఆశ్చర్య పోవాల్సింది లేదన్నారు. సీఎం కేసీఆర్ చొరవతోనే పోడు భూములకు పట్టాలు దక్కాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనులందరూ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు దక్కుతున్నాయన్నారు. 

పోడు పట్టాలు ఇట్ల ఇచ్చిన్రు.. అట్ల తీసుకున్నరు

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో మంత్రి చేతులమీదుగా పోడు పట్టాలు ఇప్పించి స్టేజీ కూడా దిగకముందే గుంజుకున్నారని పోడు రైతులు వాపోతున్నారు. పొద్దంతా మీటింగ్​లో కూర్చొబెట్టి.. పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి.. చివరకు ఉట్టిచేతులతో ఇంటికి పంపించారని చెప్పారు. మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పోడు పట్టాల పంపిణీ చేపట్టారు. ఇందుకోసం 25 మంది గిరిజన రైతులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్టేజీ సమీపంలో కూర్చోబెట్టారు.

వారిలో కొత్తగూడ మండలం చెరువుముందుతండాకు చెందిన పోడు రైతు వాంకుడోతు యాకూబ్, తాటివారిపాలెంకు చెందిన ఈసం నరసమ్మ, మొండ్రాయిగూడెంకు చెందిన పులుసము యాకమ్మ, గంగారం మండలం జంగాలపల్లికి చెందిన ఈసం ఈశ్వరమ్మ, తిరుమలగండి గ్రామానికి చెందిన అంబలి అనే ఐదుగురు రైతులను వేదిక మీదకి పిలిచారు. మంత్రి కేటీఆర్ రైతులకు పోడు పట్టాలు అందించిన తర్వాత వారు స్టేజీ దిగక ముందే జిల్లా రెవెన్యూ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు పోడు పట్టాబుక్​లు గుంజుకున్నారు. మీ మండలాల్లోనే అందరికి ఒకేసారి అందిస్తామని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను పొద్దంతా మీటింగ్​లో కూర్చో బెట్టి.. పట్టా బుక్కులు ఇట్లా ఇచ్చి అట్లా 
గుంజుకున్నారని అన్నారు.