హైదరాబాద్​లో విమానాల రిపేర్ సెంటర్

హైదరాబాద్​లో విమానాల రిపేర్ సెంటర్
  • హైదరాబాద్​లో విమానాల రిపేర్ సెంటర్
  • 1200 కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చిన ఫ్రాన్స్ సంస్థ సాఫ్రాన్
  • రాష్ట్రంలో ఏవియేషన్ పరిశ్రమకు ఇంకింత బలం: మంత్రి కేటీఆర్ 

హైదరాబాద్, వెలుగు: దేశంలోనే తొలిసారిగా విమాన ఇంజన్ల మరమ్మతు కేంద్రాన్ని హైదరాబాద్​లో ప్రారంభించేందుకు ఫ్రాన్స్​కు చెందిన సాఫ్రాన్ సంస్థ ముందుకు వచ్చింది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారు చేసే ఈ కంపెనీ .. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్(ఎంఆర్వో) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్​ను ఎంచుకుంది. ఇందుకు రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మతు కేంద్రాన్ని సాఫ్రాన్ ఏర్పాటు చేయనుంది. ఎంఆర్వో కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్​ను ఎంచుకోవడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. సాఫ్రాన్​ కంపెనీకి సంబంధించిన అతిపెద్ద నిర్వహణ కేంద్రం ఇదేనని, మన దేశంలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేనని వెల్లడించారు. పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజన్లు ఉత్పత్తిచేసే దిగ్గజ కంపెనీల్లో ఒకటైన సాఫ్రాన్ కంపెనీ రాకతో 1000 ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఇండియాతో పాటు విదేశీ వాణిజ్య విమానయాన సంస్థల విమానాల్లో వాడే లీప్ 1ఏ, లీప్ 1బీ ఇంజన్ల నిర్వహణను ఇక్కడే చేపడతారన్నారు. సాఫ్రాన్ కంపెనీ నిర్ణయంతో తెలంగాణలోని ఏవియేషన్ పరిశ్రమకు మరింత బలం చేకూరుతుందని  కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.