
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘సినిమా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో చూసే సినిమా కాదు. ప్రతిపక్షాలకు ఈ 2023లోనే అసలైన సినిమా చూపిస్తం. ఇప్పటి వరకు చూసింది ట్రైలర్ మాత్రమే” అని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కాళ్లలో కట్టెలు పెడ్తూ ప్రతి దానికీ అడ్డుపడుతున్నాయని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడ్తారని ధీమా వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ లో ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘‘ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి ప్రాంతం ఎంత రద్దీగా ఉంటుందో అందరికీ తెలుసు. కొత్త సినిమాలు విడుదలైనప్పుడు ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో జనం ఇబ్బందులు పడ్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఇక్కడి ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. నాయిని నర్సింహారెడ్డి గుర్తుగా బ్రిడ్జికి ఆయన పేరు పెట్టాం” అని కేటీఆర్ చెప్పారు. నాయిని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట పెద్దన్నల ఉండి కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ‘‘కొంతమంది మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. అలాంటోళ్లను పట్టించుకోవద్దు. గతంలో కర్ఫ్యూలు ఉండేవి. ఇప్పుడు అలాంటివేం లేవు. అన్ని కులాలను కేసీఆర్ సమానంగా చూస్తున్నారు. ప్రజలు పొరపాటు చేస్తే, హైదరాబాద్ వందేండ్లు వెనక్కి పోతుంది. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలంటే మళ్లీ కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలి” అని పిలుపునిచ్చారు. అనంతరం ఓపెన్ జీపులో స్టీల్ బ్రిడ్జి పైనుంచి కేటీఆర్ ప్రయాణం చేశారు.
రేవంత్ ప్రధానిలా బిల్డప్ ఇస్తున్నడు..
‘‘సంచులు మోసి, జైలుకెళ్లిన వ్యక్తి రేవంత్రెడ్డి. ఆయన పీసీసీ పదవేదో ప్రైమ్మినిస్టర్పదవి అన్నట్టుగా బిల్డప్ఇస్తున్నాడు. కాంగ్రెస్పాలనలో కరెంట్కోసం ఎంతో కష్టపడ్డం. వాళ్లను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టే” అని కేటీఆర్ విమర్శించారు. హిందూముస్లింల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ పని అని ఆరోపించారు. కేసీఆర్ను జైలుకు పంపుతామన్నోడే, షెడ్డుకు పోయిండని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు, అభివృద్ధి చేస్తున్నందుకు కేసీఆర్ను జైలుకు పంపుతారా అని ప్రశ్నించారు. బీజేపీని గెలిపిస్తే అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ చెప్పారని, మరి ఎవరి ఖాతాలోనైనా పడ్డాయా? అని ప్రశ్నించారు.
‘‘కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఢిల్లీ నేతల మాటలు పట్టుకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టే. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి, ఢిల్లీ గులాంగిరికీ మధ్య జరుగుతున్న పోటీ” అని అన్నారు. ‘‘ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్టు హామీలిస్తున్నాయి. ఒక్క చాన్స్ఇవ్వాలని ఒకాయన అంటున్నాడు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్పథకాలు కొనసాగిస్తామంటున్నారు. కేసీఆర్ పథకాలే కొనసాగిస్తే, ఇక వాళ్లెందుకు? సంపద పెంచాలి.. పేదలకు పంచాలనేది మా నినాదం. సంపద పెంచుకొని వెనకేసుకోవాలనేది ప్రతిపక్షాల తీరు. కులం, మతం పిచ్చోళ్లను నమ్మి 54 ఏండ్లు వెనక్కిపోయాం” అని అన్నారు. ‘‘త్వరలోనే తలకొండపల్లికి వస్తాను. వెంకటేశ్సత్తా చూస్తాను. ఆయనకు బీఆర్ఎస్అండగా ఉంటుంది. కచ్చితంగా పెద్ద పదవి ఇస్తాం” అని హామీ ఇచ్చారు.
సంచలనాల కేసీఆర్ ఓవైపు.. సంచులు మోసినోళ్లు మరోవైపు
‘‘సంచనాల కేసీఆర్ ఒకవైపు ఉంటే, సంచులు మోసినోళ్లందరూ ఇంకోవైపు ఉన్నారు. వాళ్లను నమ్మితే మునుగుతాం. రాష్ట్రం వెనక్కి పోతుంది” అని కేటీఆర్అన్నారు. శనివారం కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ బీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ తెలంగాణ భవన్లో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని 50 ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్, కృష్ణా నది పక్కనే ఉన్నా పాలమూరు జి ల్లాకు నీళ్లెందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. ‘‘పాలమూరు–రంగారెడ్డిపై కేసులు వేసి అడ్డం పడినా అనుమతులు తెచ్చుకున్నాం. కల్వకుర్తితో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తాం. రూ.400 పింఛన్ఇవ్వనోళ్లు రూ.4 వేలు ఇస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారు. కాంగ్రెస్నేతలు కథలు బాగా చెప్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ ఇవ్వనోళ్లు, ఇప్పుడు ఇస్తామంటున్నారు” అని విమర్శించారు.
అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి అమెరికాకు బయల్దేరి వెళ్లారు. వారం రోజులపాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్, చికాగో తదితర నగరాల్లోని ప్రముఖ కంపెనీల ఉన్నతాధికారులతో కేటీఆర్ సమావేశమై తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానిస్తారు. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కు అమెరికాలోని ప్రముఖ వర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్ లభించింది. మంత్రి తన టూర్లో కుమారుడి అడ్మిషన్ ప్రాసెస్ పూర్తి చేసి హైదరాబాద్కు తిరిగి రానున్నారు.