బండి సంజయ్‌‌కి మంత్రి కేటీఆర్ నోటీసులు.. ఆధారాలుంటే బయటపెట్టాలి

బండి సంజయ్‌‌కి మంత్రి కేటీఆర్ నోటీసులు.. ఆధారాలుంటే బయటపెట్టాలి

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తరపు న్యాయవాది నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీన ట్విట్టర్‌‌లో మంత్రి కేటీఆర్‌‌పై నిరాధారమైన ఆరోపణలు చేశారని, దీనిపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలని లేదంటే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానని మంత్రి కేటీఆర్ నోటీసుల్లో హెచ్చరించారు. 2019లో ఇంటర్ మీడియట్ రిజల్ట్స్ లో చోటు చేసుకున్న పరిణామాలపై బండి సంజయ్ పలు ఆరోపణలు చేశారు. ఈ మేరకు మే 13వ తేదీ శుక్రవారం మంత్రి కేటీఆర్ తరపు అడ్వకేట్ నోటీసులు జారీ చేశారు. 

మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారపూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో పేర్కొన్నారు. ఒక జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ప్రజా జీవితంలో కనీస ప్రమాణాలు పాటించడం లేదని, కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని నోటీసుల్లో వెల్లడించారు. మంత్రి కేటీఆర్ గారి పరువుకు కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసినట్లు.. సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని నోటీసులో వెల్లడించారు. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్‌‌కి క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయవద్దని.. లేనిపక్షంలో లీగల్ నోటీసులు పంపించడం జరుగుతుందని మే 12వ తేదీన ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. 

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల్లో  ఎన్నో వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 2019లో జరిగిన ఇంటర్ పరీక్షా ఫలితాలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. 99 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఫెయిల్ కావడంతో ఇంటర్ బోర్డుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు, ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలు చేశారు. కేటీఆర్ నిర్వాకం వల్లే విద్యార్థులు మరణించారని, కనీసం వారిని పరామర్శించలేదని గతంలోనే పలువురు వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరినా సంస్థపై న్యాయ విచారణ జరిపించాలని అప్పట్లోనే డిమాండ్స్ వినిపించారు. గ్లోబరినా సంస్థలో ఉన్న సాఫ్ట్ వేర్ లో తప్పిదం వల్లే ఇదంతా జరిగినట్లు, ఈ సంస్థ కేటీఆర్ స్నేహితుడిదని.. అర్హత లేని సంస్థకు ఎగ్జామ్ పేపర్లు ఎందుకు ఇచ్చారని పలువురు ప్రశ్నించారు. మరి.. తాజాగా.. మంత్రి కేటీఆర్ తరపు న్యాయవాది నోటీసులు జారీ చేసిన క్రమంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

 

మరిన్ని వార్తల కోసం 

ఫ్లైట్ క్యాబిన్ డోర్ను కాలితో మూసింది

పెళ్లిలో మంటలు అంటించుకున్న వధూవరులు, షాకింగ్ వీడియో