ఓటమి భయంతో కిషన్ రెడ్డి పరారైండు .. తట్టాబుట్టా సర్దుకుని పోటీ చేస్తలేడు: కేటీఆర్

ఓటమి భయంతో కిషన్ రెడ్డి పరారైండు .. తట్టాబుట్టా సర్దుకుని పోటీ చేస్తలేడు: కేటీఆర్

ఆమనగల్లు/షాద్ నగర్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ ఎత్తిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ఓటమి భయంతో తట్టాబుట్టా సర్దుకుని పోటీ చేయకుండా పారిపోయారని విమర్శించారు. ‘‘ఓవైపు మోదీ, అమిత్​ షా, 16 మంది కేంద్ర మంత్రులు, 15 మంది సీఎంలు.. మరోవైపు సోనియా, రాహుల్ , ప్రియాంక లాంటి షేర్​ఖాన్​లు, బఫర్ ఖాన్​లు, తీస్​మార్ ​ఖాన్​లు వస్తున్నారు. కానీ కేసీఆర్ సింహంలా సింగిల్​గా వచ్చి విజయం సాధిస్తారు” అని ధీమా వ్యక్తం చేశారు. 

ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో కేటీఆర్ ​మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ​హయాంలో కరెంట్ వస్తే వార్త. అదే మా పాలనలో కరెంట్ ​పోతే వార్త. 11 సార్లు అధికారమిస్తే ఏమీ చేయని కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు మళ్లీ ఒక్క చాన్స్ అంటూ వస్తున్నారు. కాంగ్రెస్​పాలనలో కరెంట్, సాగు, తాగు నీళ్లకు కష్టాలు ఉండేవి. అవన్నీ గుర్తుచేసుకుని ఆలోచించి ఓటు వేయాలి’’ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

కర్నాటక నుంచి వస్తున్నోళ్లకు బుద్ధి చెప్పండి.. 

‘‘దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా? అని రాహుల్ గాంధీ అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఢిల్లీ దొరలకు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంలో విజయం ఎవ్వరిదో తెలుస్తుంది. కష్టాల కాంగ్రెస్ ​కావాలా.. అభివృద్ధి చేసే బీఆర్ఎస్​ కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలి. బక్క పలచని కేసీఆర్​ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ స్థానిక నాయకులు పనికిరారని.. గుజరాత్, ఢిల్లీ, కర్నాటక నుంచి సన్యాసులు, సిపాయిలు వస్తున్నరు. 

కర్నాటక నుంచి డబ్బు సంచులతో వస్తున్నోళ్లకు తగిన బుద్ధి చెప్పాలి” అని అన్నారు. కాంగ్రెస్ ​డబ్బులిస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం బీఆర్ఎస్​కే వేయాలని కోరారు. జైపాల్ యాదవ్​ను గెలిపిస్తే కల్వకుర్తిలోని 3 గ్రామాలను మండలాలు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్​కు డబ్బుపైనే ధ్యాస ఉందని, ప్యారాచూట్​గాళ్లను తీసుకొచ్చి టికెట్లు ఇచ్చిందని మాజీ మంత్రి నాగం జనార్దన్​ రెడ్డి అన్నారు. 

కాంగ్రెస్, బీజేపీలో మొగోళ్లు లేరా? 

‘‘ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కర్నాటక నుంచి నాయకులను దిగుమతి చేసుకుంటున్నది. బీజేపీ గుజరాత్ నుంచి నాయకులను రప్పిస్తున్నది. తెలంగాణలో ఈ రెండు పార్టీలకు మొగోళ్లు లేరా?” అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆదివారం షాద్​నగర్​లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. గుజరాత్ గులాములకు తెలంగాణ ప్రజలు తలవంచరన్నారు. ‘‘రాహుల్ గాంధీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. 

ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతున్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నాను. రాహుల్ సవాల్​ను స్వీకరిస్తున్నాను” అని చెప్పారు. కాగా, కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, నాగర్ కుంట నవీన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు.