
- ఆయిల్ కంపెనీలకు కాసుల పంట.. కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట
- ఒకప్పుడు రూ.400 ఉన్న సిలిండర్ ధర ఇప్పడు రూ.1100 అయ్యింది
- వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మోడీపై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: పేద, మధ్యతరగతి వంటిట్ల నుంచే బీజేపీ పతనం షురూ అవుతుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. వంట గ్యాస్ ధరల పెంపుపై మోడీని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఆయిల్ కంపెనీలకు కాసుల పంట.. కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట అంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మోడీ పాలనలో నిత్యావసర సరుకులు, పెట్రో ధరలు ఆకాశానికి పాకుతున్నాయని, ఆదాయం మాత్రం పాతాళంలోకి పోతోందని ఫైర్ అయ్యారు. ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం చేస్తూ.. ఆడబిడ్డలపై మోడీ ఆర్ధిక భారం మోపుతున్నారని మండిపడ్డారు. మోడీకి ఆయిల్ కంపెనీల నష్టాలు మాత్రమే కనిపిస్తాయని, పేదల కష్టాలు ఏమాత్రం కనిపించవని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు రూ.400 ఉన్న గ్యాస్ ధర ప్రస్తుతం రూ.1100 నాటౌట్ అంటూ కామెంట్ చేశారు.
పేదోడి చేతిలో పొగ గొట్టం పెట్టడమే మోడీ లక్ష్యం
పేదోడి పొట్టగొట్టడం..మళ్లీ అతడి చేతిలో పొగగొట్టం పెట్టడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పని చేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ సబ్సిడీలు ఎత్తేసి మళ్లీ గ్యాస్ కంపెనీలకు సబ్సిడీ ఎలా ఇస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయిల్ కంపెనీలకు కాదు.. ఆర్ధికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిలిండర్ భారాన్ని మూడింతలు చేసి.. ఇప్పుడు మూడు సిలిండర్లు అంటూ మోడీ ప్రభుత్వం కొత్త రాగం ఎత్తుకుందని విమర్శించారు. మూడు సిలిండర్లతో మూడు పూటల వంట ఎలా సాధ్యమో బీజేపీ నేతలు చెప్పాలని మంత్రి నిలదీశారు. మోయలేని భారాన్ని మోపుతూ పేద ప్రజలను మోసం చేస్తోంది మోడీ అనే విషయం దేశంలోని మహిళలకు అర్థమైందని కేటీఆర్ చెప్పారు.