
కాంగ్రెస్ పాలనలో కరెంటు ఉంటే వార్త.. కేసీఆర్ పాలనలో కరెంటు పోతే వార్త అని మంత్రి కేటీఆర్ అన్నారు. 2023 మార్చి 15న కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. బిచ్కుంద, పిట్లం మండలాలను మున్సిపాలిటీగా మారుస్తామన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ రేవంత్ రెడ్డి గొంతు చించుకుంటున్నాడు..10 సార్లు అవకాశాలు ఇస్తే 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. పరిపాలించడం చేతగాని వారు ఇపుడు ఒక్క చాన్స్ ఇవ్వమని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. అబద్ధాలు చెప్పడం, నటనలో మోడీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి.. మోడీ మహా నటుడు అంటూ కేటీఆర్ విమర్శించారు. దేశ సంపద అంతా దోస్తు ఖాతాలో జమచేస్తూ విపక్షాలను కొనుగోలు చేస్తున్నాడని ఆరోపించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నల్లధనం తెస్తానని మోడీ ఇపుడు తెల్లమొఖం వేశాడన్నారు కేటీఆర్.
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేయాలని చెప్పిన కేటీఆర్..తెలంగాణపై కేంద్రం కక్ష గట్టిందని మండిపడ్దారు. తెలంగాణకు పట్టిన శని బీజేపీ అని వ్యాఖ్యానించారు. మోడీ ఈడీ లకు తాము భయపడమని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని ప్రతిపక్ష పార్టీలకు కేటీఆర్ సవాల్ విసిరారు. కేసీఆర్ ను కాపాడుకుని.. వచ్చే ఎన్నికల్లో గెలిచి మూడో సారి సీఎం చేసుకుందామని తెలిపారు.