రాష్ట్రానికి 10 సార్లు వచ్చిండు.. ఒక్క రూపాయి తెచ్చిండా

రాష్ట్రానికి 10 సార్లు వచ్చిండు.. ఒక్క రూపాయి తెచ్చిండా

వేములవాడ, వెలుగు: ‘‘కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దండయాత్రకు వస్తున్నట్టు ఉంది. కులాలు, మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉంటున్న తెలంగాణ ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే వస్తున్నట్లు ఉంది” అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఎందుకు వస్తున్నారో చెప్పడం లేదన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుడి చెరువు మైదానంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఏంటని ప్రశ్నించారు. ‘‘రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ సర్కారు ఓర్వలేకపోతున్నది. మేం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? ఉంటే చూపించాలి. మేం చూడడానికి సిద్ధంగా ఉన్నాం” అని చెప్పారు. మత పిచ్చి వాళ్లు మన మధ్యలో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ వాళ్లవి బోగస్, బక్వాస్ ముచ్చట్లని విమర్శించారు.

కాళేశ్వరానికి ప్రత్యేక హోదా ఇస్తడా?

రాష్ట్రానికి అమిత్ షా ఇప్పటికి 10 సార్లు వచ్చారని.. ఒక్క రూపాయి తెచ్చారా అని కేటీఆర్ ప్రశ్నించారు. మాట్లాడితే హిందూ ముస్లిం అంటున్నారు తప్ప.. బీజేపీ వాళ్ల దగ్గర మాట్లాడడానికి ఏం లేదన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జైల్లో పెడుతామని అంటున్నారని, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు జైల్లో పెడ్తారా అని ప్రశ్నించారు. బీజేపీ అగ్ర నాయకత్వానికి అంబేద్కర్ గుర్తుకు రారని, అంబానీ లాంటి వాళ్లు మాత్రమే గుర్తుకువస్తారని ఆరోపించారు. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్​ చేశారు. ‘‘అమిత్ షా హైదరాబాద్ వచ్చి కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తాడా? లేక తెలంగాణకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తాడా? చూద్దాం” అని ఎద్దేవా చేశారు. స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వాన్ని  ఆకాంక్షించిన అంబేద్కర్ గొప్పదనం తెలిసేలా తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టామని చెప్పారు.

కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైపు దూసుకొచ్చిన యువకుడు

కేటీఆర్ పాల్గొన్న సభలో ఓ యువకుడు హల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చల్ చేశాడు. పోలీసులను దాటుకుని సభా వేదిక పైకి దూసుకెళ్లాడు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. యువకుడిని శిలగాని సాయికిరణ్ (26)గా గుర్తించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కల గూడూరుకు చెందిన సాయికిరణ్.. డబుల్ బెడ్రూం ఇల్లు అడిగేందుకుకేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సీఐ వెంకటేశ్ తెలిపారు.