కాంగ్రెస్ ఫేక్ సర్వేలు చూసి ఆగం కావొద్దు : కేటీఆర్

కాంగ్రెస్ ఫేక్ సర్వేలు చూసి ఆగం కావొద్దు : కేటీఆర్
  • కాంగ్రెస్ ఫేక్ సర్వేలు చూసి ఆగం కావొద్దు 
  • నిజమేంటో తెలుసుకుని ఓటేయాలి: కేటీఆర్
  • ప్రజల మూడ్ క్లియర్ ఉంది.. కేసీఆరే మళ్లీ సీఎం
  • బీఆర్ఎస్​పై ఎక్కడా వ్యతిరేకత కనిపించలే
  • ఒకవైపు కారు.. మరోవైపు బేకార్ గాళ్లున్నరని కామెంట్

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్​ను ఎదుర్కోలేకే ఫేక్ సర్వేలతో కాంగ్రె స్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలు ఆగం కావొద్దని, నిజమేంటో తెలుసుకుని ఓటేయాలని సూచించారు. ప్రజల మూడ్ కూడా క్లియర్​గా ఉందని, మూడో సారి కేసీఆరే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం దేవరకొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత బీల్యా నాయక్​తో పాటు పలువురు లీడర్లు తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్​లో చేరారు. వారికి కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘నేను 15 రోజుల్లో 32 నుంచి 33 నియోజ‌‌క‌‌వ‌‌ర్గా ల్లో పర్యటించా. రాష్ట్రంలోని నాలుగు మూలలు తిరి గిన. వేల మంది ప్రజలు పాల్గొన్న సభల్లో ప్రసంగించిన. ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదు. మళ్లీ కేసీఆరే సీఎం అవుతరు. తొమ్మిదిన్నరేండ్లు ఒకే పార్టీ అధికారంలో ఉందంటే.. ఎక్కడో ఓచోట కాస్త వ్యతిరేకత ఉంటది. అది సహజం..”అని కేటీఆర్ అన్నారు.

రేవంత్ అంటలేరు.. రేటెంత అంటున్నరు..

‘‘ఎన్నికలు వస్తున్నాయనంగనే.. కాంగ్రెస్ లీడర్లు కొత్త అంగీ, లాగు కుట్టించుకుంటరు. ఇండ్లకు సు న్నాలు ఏస్తరు. నేను మంత్రి అంటే.. నేను మంత్రి అంటరు. ఇంకొకడు నేనే సీఎం అంటడు. ఇట్ల ఐదారుగురు జమైతరు.. ఫేక్ సర్వేలు పుట్టించి.. ఇగ బీఆర్ఎస్ పని అయిపోయింది అని పుకార్లు పుట్టిస్తరు. పోయిన ఎలక్షన్ల టైమ్​లో కూడా సేమ్ కథ.. సేమ్ బొబ్బ.. ఇదే లొల్లి.. అప్పుడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఒక స్టేట్​మెంట్ ఇచ్చిండు.. కేసీఆర్​ను ఓడించే దాకా గడ్డం తియ్య అన్నడు. ఇలాంటి డైలాగ్​లు.. స్పీచ్​లు.. బిల్డప్​లు.. మస్తుగ ఇన్నం..”అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్​రెడ్డి కూడా కొడంగల్​లో ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని డైలాగ్ కొట్టారని, ఇప్పుడు మళ్లీ పోటీ చేస్తున్నారని విమర్శించారు. ‘కాంగ్రెసోళ్లకు ఎలక్షన్లు అంటే ఏటీఎంల లెక్క కనిపిస్తయ్. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ అంటే ఐదారేండ్ల కింద ఓటుకు నోటు.. ఇప్పుడు సీటుకు నోటు.. ఇప్పుడు ఆయన్ని రేవంత్ అంటలేరు.. రేటెంత అంటున్నరు..”అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

60 ఏండ్లు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నరు

ఒకవైపు కారు ఉంటే.. మరోవైపు బేకార్ గాళ్లు ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్నా.. కరెంట్ ఇవ్వలేదని, ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్​కు ఓటు ఎందుకు వేయాలో చెప్పాలన్నారు. కాంగ్రెస్ జమానాలో ఉన్న కరెంట్ కోతలు, వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు, తాగునీటి కొరత లాంటి దుర్భర పరిస్థితులు మళ్లీ తెచ్చుకోవద్దని సూచించారు. బీఆర్ఎస్ అంటే స్కీమ్​లు అని, కాంగ్రెస్ అంటే స్కామ్​లు అని విమర్శించారు. పదేండ్ల పాలనలో తెలంగాణను కేసీఆర్ నంబర్ వన్ స్థానంలో ఉంచారన్నారు. మూడో సారి కేసీఆర్​ సీఎం అయితేనే రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలు మరింత అభివృద్ధి చెందుతారని చెప్పారు.