న్యూజిలాండ్ లో సిరిసిల్ల చీరలకు ఫుల్ క్రేజ్

న్యూజిలాండ్ లో సిరిసిల్ల చీరలకు ఫుల్ క్రేజ్

హైదరాబాద్: ‘రాజన్న సిరిపట్టు’ బ్రాండ్ కు మరింత ప్రచారం కల్పిస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్ల నేతన్నలు తయారు చేసిన “రాజన్న సిరిపట్టు” చీరలను న్యూజిలాండ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అక్కడి మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్చువల్ గా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో న్యూజిలాండ్ మంత్రికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వీడియో సందేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... సిరిసిల్లకు చెందిన నేతన్నల ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడం చాలా సంతోషాన్నిస్తోందని చెప్పారు. 

ఒకప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేతన్నలు.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో  నేడు వినూత్నమైన ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆకర్షించే పరిస్థితికి చేరుకున్నారని తెలిపారు. సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ వంటి నైపుణ్యం కలిగిన నేతన్నలు అగ్గిపెట్టెలో పట్టే చీరలు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారని కొనియాడారు. నాలుగేళ్ల కిందట బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం గురించి తెలుసుకున్నారని, అప్పటి నుంచి సిరిసిల్ల పట్టు చీరలకు అమెరికా, యూకే, న్యూజిలాండ్ వంటి దేశాల్లో క్రేజ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇక  సిరిసిల్ల ‘రాజన్న సిరిపట్టు’ చీరలను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ అన్నారు. వ్యక్తిగతంగా తనకు పట్టు చీరలు అంటే ఎంతో ఇష్టమని, బతుకమ్మ పండుగ సమయంలో పట్టు చీరలను ధరిస్తానని ఆమె చెప్పారు.