
సీఎం కేసీఆర్ ఒక ఫైటర్ అని..చీటర్స్తో ఆయన కలవరని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్డీఏ మునిగిపోయే నావ అని....అందులో ఎవరూ చేరరని స్పష్టం చేశారు. ఎన్డీఏలో చేరేందుకు తమకు ఏమైనా పిచ్చికుక్క కరిచిందా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను సీఎం చేయడానికి మోదీ పర్మీషన్ అవసరం లేదన్నారు. తమ ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రజల అనుమతి చాలు అని చెప్పారు. మోదీవి పచ్చి అబద్దాలు, పిచ్చి ప్రేలాపనలు అని మండిపడ్డారు. బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ అని విమర్శించారు.
గత ఎన్నికల్లో 105 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతయ్యానని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సారి 110 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతవడం ఖాయమని చెప్పారు. మోదీకి ఇదే నా ఛాలెంజ్ అని సవాల్ విసిరారు. అంతేకాకుండా ఈసారి బీజేపీకి ఒక్క ఎంపీ స్థానం కూడా రాదన్నారు.
ముప్తీతో పొత్తు పెట్టుకున్నప్పుడు రాజులు, యువరాణులు గుర్తురారని మంత్రి కేటీఆర్ మోదీని ప్రశ్నించారు. దేవెగౌడ కొడుకు కుమారస్వామి ఎన్డీఏలో చేరినప్పుడు రాచరికం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. అకాళీదళ్, పీడీపీ, టీడీపీ, శివసేన, జేడీఎస్ ల విషయంలో రాచరికం గుర్తు రాలేదా అని అడిగారు. హిమంతు బిశ్వశర్మ, జోతిరాధిత్యపై ఉన్న కేసులు..వాళ్లు బీజేపీలో చేరిన తర్వాత ఏమయ్యాయని అని ప్రశ్నించారు. అమిత్ షా కొడుకు జైషా ఎవరు..ఆయనకు బీసీసీఐ జనరల్ సెక్రటరీ పదవి ఎందుకు ఇచ్చారని నిలదీశారు.
తాము ఎవరికీ గులాం కాదన్నారు మంత్రి కేటీఆర్. మోదీ నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. మోదీ ఎంత అరిచినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ను సీఎంగా ఎంచుకుంటారని తెలిపారు. గత తొమ్మిది ఏళ్లలో తెలంగాణకు బిజెపి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదానీ విషయంలో ఎందుకు వెనుకడుగు వేశారని...జిపిసి ఎందుకు వేయరని ప్రశ్నించారు. తాము కర్ణాటకకు డబ్బులు పంపితే కేంద్ర ఐటి టీం ఏం చేస్తుందని నిలదీశారు. నిజామాబాద్ లో మోదీ మాట్లాడిన మాటల్లో ఆయన ఫ్రస్టేషన్ బయటపడిందని ఎద్దేవా చేశారు.
70 ఏళ్ల మోదీ తన పదవికి తగ్గట్టు ప్రవర్తించడం లేదన్నారు. మోదీ సినిమాలకు స్టోరీలు రాస్తే..ఆస్కార్ కూడా వస్తుందని చురకలంటించారు.