బేవకూఫ్ గాళ్లు రాజీనామా చెయ్యమంటున్నారు : కేటీఆర్

బేవకూఫ్ గాళ్లు రాజీనామా చెయ్యమంటున్నారు : కేటీఆర్

ఎల్బీ నగర్, వెలుగు:  టీఎస్ పీఎస్సీతో ప్రభుత్వానికేం సంబంధమని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘టీఎస్ పీఎస్సీ స్వయం ప్రతిపత్తి సంస్థ. దాంతో విద్యాశాఖకు గానీ, ఐటీ శాఖకు గానీ సంబంధం ఉండదు. కేవలం నిధుల రూపంలో ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఈమాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేని కొంతమంది బేవకూఫ్ గాళ్లు నేను వెంటనే రాజీనామా చెయ్యాలని అంటున్నారు’’ అని ప్రతిపక్షాలపై ఆయన ఫైర్ అయ్యారు. శనివారం ఎల్బీనగర్ కుడివైపు ఫ్లైఓవర్ ను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొడుకు ప్రశాంత్ రెడ్డి చేసిన ప్రగతి నివేదన యాత్ర ముగింపు సభ పెద్ద అంబర్​పేట్​లో జరగ్గా అందులో పాల్గొని మాట్లాడారు. టీఎస్ పీఎస్సీ పేపర్లు లీకైంది కరెక్టేనని, అం దుకే లీకైన పేపర్లను రద్దు చేశామని కేటీఆర్ చెప్పారు. ఆ ఎగ్జామ్స్​ మళ్లీ నిర్వహిస్తామన్నారు. 

‘‘రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ్ముళ్లు, చెల్లెళ్లకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పులు జరగొద్దనే ఎగ్జామ్స్​ను రద్దు చేసినం. అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. జరిగిన పొరపాట్లను సవరించుకొని ముందుకుపోతం. దయచేసి ఈ చిల్లరగాళ్లు పన్నిన ఉచ్చులో మీరు చిక్కుకోకండి. మీకోసం రీడింగ్ రూమ్స్, లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లు పెట్టినం. వందకు వంద శాతం మీకు న్యాయం జరిగే వరకూ చిత్తశుద్ధితో పని చేస్తం” అని చెప్పారు. ‘‘ఒక్క చాన్స్ ఇవ్వం డి అంటూ కాంగ్రెసోళ్లు ప్రజల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇన్నేళ్లు అధికారం ఇస్తే ఏం చేశారు?” అని ప్రశ్నించారు. ‘‘అధికారంలో వస్తే 15 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. మరి ఆ ఉద్యోగాలన్నీ ఏవీ? రాష్ట్ర బీజేపీ నాయకులు నిరుద్యోగ మార్చ్ చేస్తామని అంటున్నారు. ఆ మార్చ్ ఉద్యోగాలు ఇవ్వని మోడీ ఇంటి ముందు చేయాలి” అని అన్నారు.  

పనులు చేసే ఎన్నికలకు వెళ్తం.. 

ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు, ఎల్బీనగర్ కుడివైపు ఫ్లైఓవర్ కు మాల్ మైసమ్మ పేరు పెడ్తామని కేటీఆర్ ప్రకటించారు. ‘‘ఎల్బీనగర్ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రూ.658 కోట్లతో 12 పనులు చేపట్టినం. అందులో 9 పనులు పూర్తయ్యాయి. బైరమాల్ గూడ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్, కుడివైపు క్లోవర్ 1, ఏడమ వైపు క్లోవర్ 2 పనులను సెప్టెంబర్ కల్లా పూర్తి చేస్తాం. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తాం” అని చెప్పారు.  

మంత్రి సమక్షంలో వర్గ పోరు 

మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో వర్గ పోరు బయటపడింది. బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఇంచార్జ్ రామ్మోహన్ గౌడ్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. కేటీఆర్ మాట్లాడుతున్న టైమ్ లో ఎమ్మెల్యే వర్గీయులు మాజీ కార్పొరేటర్ రమణారెడ్డిని స్టేజీ కిందకు దించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసే క్రమంలో రమణారెడ్డి పరుగులు తీసి తప్పించుకున్నారు.