నవీపేట్, వెలుగు : మండలంలో యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు. సీసీ సాయి చైతన్య కఠిన చర్యలు తీసుకుంటున్నా చాటుమాటుగా పేకాట సాగుతోంది. యంచ, అల్జపూర్, ఫాకీరాబాద్, నవీపేట్, పోతంగల్, జన్నేపల్లి, బినోల గ్రామాలు పేకాటరాయుళ్లకు అడ్డగా మారాయి. కొందరు ఏజెంట్లుగా ఏర్పడి బోధన్, సాలుర, రెంజల్, నిర్మల్ జిల్లా బాసర, ముధోల్ మండలంతో పాటు మహారాష్ట్రలోని ధర్మాబాద్ ప్రాంతాల నుంచి పేకాట ఆడేందుకు వస్తున్నారు. గేమ్‌లో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. ఏజెంట్లు పేకాటరాయుళ్లకు ఫుడ్, మందుతోపాటు గేమ్ కు ఒకరేటు చొప్పున అమౌంట్ వసూలు చేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. పేకాటను కట్టడి చేయాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు.
స్థానిక పోలీసుల్లో కొందరు పేకాట ఏజెంట్లకు సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్పెషల్ పార్టీ, టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇస్తున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. నిజామాబాద్ నుంచి స్పెషల్ పార్టీ, టాస్క్ పోర్స్ పోలీసులు వచ్చి అల్జపూర్, మిట్టపూర్ ప్రాంతాల్లో పలుమార్లు పేకాట స్థావరాలపై దాడులు చేసి పేకాటరాయుళ్లను స్థానిక పోలీసులకు అప్పజెప్పారు. అయినా స్థానిక పోలీసుల్లో మార్పు రావడం లేదని ఇంకా పేకాటరాయుళ్లకే అండగా ఉంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
