తాడ్వాయి, వెలుగు: మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణితో కలిసి పరిశీలించారు. పర్యటనలో భాగంగా జంపన్న వాగు వద్ద పర్యవేక్షణ సమయంలో ఓ చిన్నారి తప్పిపోయి ఉన్నట్లు గమనించిన మంత్రి సీతక్క, వెంటనే ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకుని తల్లిదండ్రులను గుర్తించాలని అధికారులను కోరారు.
స్పందించిన ఆఫీసర్లు వెంటనే గుర్తించగా, మంత్రి ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. మంత్రి మాట్లాడుతూ జాతరలో చిన్నపిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. ఎవరైనా తప్పిపోతే వెంటనే సమీపంలో ఉన్న యూనిఫాం ధరించిన పోలీస్ సిబ్బందిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మేడారంలో 'మిస్సింగ్స్ క్యాంపులు' ఏర్పాటు చేశామని, వీటి ద్వారా తప్పిపోయిన వారిని త్వరగా గుర్తించి, కుటుంబ సభ్యులకు వద్దకు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందరూ సహకరించి జాతరను సురక్షితంగా నిర్వహించుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
