చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలి : కేటీఆర్

చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలి : కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర టెక్స్ టైల్ రంగానికి తగినన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక వినూత్న కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టిందని తెలిపారు. కానీ ఎనిమిదేండ్లుగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అందిన ప్రోత్సాహమేదీ లేదని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదేనన్న కేటీఆర్, వచ్చే ఏడాది కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే వీలుంటుందన్నారు.అందుకే ఈ బడ్జెట్లోనే భారీగా నిధులు కేటాయించి నేతన్నలు, టెక్స్ టైల్ రంగం పట్ల తమ చిత్తశుద్ధిని మోడీ సర్కార్ నిరూపించుకోవాలని సూచించారు. రానున్న బడ్జెట్ లోనైనా టెక్స్ టైల్ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు అందివ్వాలని కేటీఆర్ కోరారు. ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, ప్రతిసారి ఆర్థిక శాఖ మంత్రులు మారుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బడ్జెట్లో టెక్స్ టైల్ రంగానికి దక్కుతున్నది శూన్యమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

మౌలిక వసతులు కల్పించండి

భారతదేశ టెక్స్ టైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందాలంటే భారీ ఎత్తున మౌలిక వసతున కల్పన చేయడం అత్యంత కీలకమైన అంశమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఆ మేరకు దేశంలోనే అతిపెద్ద టెక్స్ టైల్ పార్కును కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ పేరుతో ఏర్పాటు చేస్తుందని కేటీఆర్  తెలిపారు. ఈ మెగా టెక్స్  టైల్ పార్కులో జాతీయ, అంతర్జాతీయ  దిగ్గజ సంస్ధలు పెట్టుబడి  పెడుతున్నాయని చెప్పారు. దేశీయ  టెక్స్  టైల్ రంగంలో ఈ పార్కుకున్న ప్రాధాన్యతను  గుర్తించాలని కేటీఆర్  కేంద్రాన్ని కోరారు. ఈ మెగా టెక్స్ టైల్ పార్క్ మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం నుంచి సహాయం కోసం అనేకసార్లు అభ్యర్థించినా ఇప్పటిదాకా ఒక్క రూపాయిని కూడా కేటాయించలేదని కేటీఆర్ గుర్తుచేశారు. సుమారు 1600 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ భారీ టెక్స్ టైల్ పార్క్ ఖర్చులో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. ఈసారి బడ్జెట్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్  మౌళిక వసతులు కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కనీసం 900  కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. 

పాలసీ ప్రోత్సాహకాలు అందించండి

కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేయకపోవడం,పాలసీ ప్రోత్సాహకాలు లేకపోవడం వలన పొరుగు దేశాలు బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్న దేశాల కన్నా టెక్స్ టైల్ రంగంలో ఇండియా వెనుకబడిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. ఇలాంటి చిన్న దేశాలతో పోటీపడేందుకు కేంద్ర ప్రభుత్వానికి 8 సంవత్సరాల కాలం సరిపోలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు కిటెక్స్ లాంటి అంతర్జాతీయంగా పేరు ఉండిన భారీ సంస్థ దేశాన్ని వదిలిపెట్టి వెళ్లే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్ టైల్ లాంటి మౌలిక వసతులు, పాలసీ ప్రోత్సాహకాల వలన మన దేశంలోనే ఉండి పోయిన విషయం వాస్తవం కాదా అన్నారు. ఐడేండ్ల కిందనే ఒక రాష్ట్రంగా అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలతో పోటీపడే విధంగా భారీ మౌలిక వసతుల కల్పన చేపట్టి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఎనిమిదేండ్లలో ఇలాంటి ఒక భారీ ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి మౌలిక వస్తువుల కల్పన, పాలసీ ప్రోత్సాహకాలు లేకుంటే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మేకిన్ ఇండియా ఒక నినాదంగా మాత్రమే మిగిలిపోతుందన్నారు. టెక్స్ టైల్ రంగంలోని అంతర్జాతీయ సంస్థలను మన దేశానికి రప్పించడంలో మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు.

నేతన్నలకు భవిష్యత్తుపై భరోసా కల్పించాలి

నేతన్నలకు భవిష్యత్తుపై భరోసా కల్పించే ఉద్దేశంతో కాంప్రహెన్సివ్ పవర్ లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీంలో భాగంగా సిరిసిల్లలో భారీ పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి ముందుకు పోతున్నదని కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు 5000పైగా పవర్లూమ్ మగ్గాలు ఉంటే, కేంద్ర ప్రభుత్వం నిధులు అందించే వీలుందని, ఈ మేరకు కేంద్రం నిధులు అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్ లో 25 వేలకు పైగా పవర్లూమ్ మగ్గాలు ఉన్నాయన్నారు. ఈ బడ్జెట్ లో దీన్ని ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ గా గుర్తించి, ఈ ప్రాజెక్టు కోసం కనీసం 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులను అందించాలని కేటీఆర్ కోరారు. మరోవైపు మెగా పవర్ లూమ్ క్లస్టర్ కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ స్కీం, టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల మరమగ్గాల ఆధునికీకరణ, వాల్యూ చైన్ బలోపేతం, మార్కెట్ అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్, ప్రాజెక్ట్ మానిటరింగ్ వంటి ఖర్చుల కోసం సుమారు 990 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఇందులో సింహభాగాన్ని ఈ బడ్జెట్ లో కేటాయించాలని కోరారు. ఇప్పటికే పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పవర్లూమ్ రంగాన్ని తెలంగాణలో బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. దీంతోపాటు ఇన్ సిట్యూ పవర్ లూమ్  అప్ గ్రేడేషన్ కార్యక్రమం కింద  మరో 13 వేల మర మగ్గాల అధునీకీకరణకు నిధులు కేటాయించాలని కోరారు. 

బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లలను మంజూరు చేయండి

రాష్ట్రంలో పవర్లూమ్ పరిశ్రమతో పాటు చేనేత పరిశ్రమకు కూడా తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత ఉందని తెలిపిన మంత్రి కేటీఆర్, రాష్ట్రంలో సుమారు 40వేల హ్యాండ్లూమ్ కార్మికులు పని చేస్తున్నారన్నారు. ఇందులో యాదాద్రి భువనగిరి, గద్వాల్, వరంగల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. చేనేత కళపై డిప్లొమా చేసేందుకు ఇక్కడి విద్యార్థులకు అవకాశం లేదని వీరంతా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్లి శిక్షణ పొందుతున్న నేపథ్యంలో తెలంగాణకి ఈ విద్యా సంస్థ మంజూరు చేస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉండడంతో పాటు ఇక్కడి చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడుతుందని కేటీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి గుండ్ల పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలో అవసరమైన స్థలం అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు నేషనల్ టెక్స్ టైల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్, హ్యండ్ లూమ్ ఎక్స్ పోర్ట్ ప్రొమోషన్ కౌన్సిల్ ఏర్పాటును ఈ బడ్జెట్ లో ప్రకటించాలని కోరారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లలను మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రం పదకొండు చేనేత  క్లస్టర్ల ఏర్పాటుకు రూ.20 కోట్ల నిధులు కేటాయింపు కోసం ప్రతిపాదనలు పంపిన అంశాన్ని కేటీఆర్ గుర్తు  చేశారు. 

తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి నిధులు కేటాయించాలి

అనేక వినూత్నమైన కార్యక్రమాలతో పాటు మౌలిక వస్తువులు కల్పన ద్వారా దేశ టెక్స్ టైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకుంటున్న ప్రగతిశీల రాష్ట్రం తెలంగాణ కు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత కేంద్రపై ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ గత బడ్జెట్ కేటాయింపులను చూస్తే టెక్స్ టైల్ రంగాన్ని కాపాడుకుంటున్న తెలంగాణ లాంటి రాష్ట్రాల పట్ల ప్రగతి నిరోధకుల పాత్రను కేంద్రం పోషిస్తున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈ బడ్జెట్ లో నైనా తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి భారీగా నిధులు కేటాయించి టెక్స్ టైల్ రంగం పట్ల తమకున్న నిబద్ధతను చాటుకోవాలని సూచించారు. లేకుంటే మరోసారి దేశంలోని నేతన్నలు, టెక్స్ టైల్ రంగం పట్ల తమకున్న చిన్న చూపును కేంద్రం చాటుకున్నట్లు అవుతుందని కేటీఆర్ తెలిపారు. 

నేత కార్మికుల పొదుపు పథకాన్ని తిరిగి ప్రారంభించాలి

బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడంతోపాటు గత ఏడు సంవత్సరాలుగా మోడీ ప్రుభుత్వం అమలుచేస్తున్న చేనేత, టెక్స్ టైల్ వ్యతిరేక విధానాలను  పునర్ సమీక్షించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నేత కార్మికులకు రద్దు చేసిన పొదుపు పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు అధికారంలోకి వచ్చాక మోడీ ప్రభుత్వం రద్దు చేసిన ఆల్ ఇండియా హ్యాండ్లూమ్, పవర్ లూం, హాండీ క్రాప్ట్ బోర్డులను తిరిగి ఏర్పాటు చెయ్యాలన్నారు. ఇక వర్క్ కం ఓనర్ షెడ్ పథకాన్ని తిరిగి పునరుద్దరించి నేతన్నలు తమ కాళ్లపై తాము నిలబడే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే యార్న్ సబ్సిడీని కనీసం 50 శాతానికి పెంచడంతో పాటు  మార్కెటింగ్ ఆధారిత ఇన్సెంటీవ్ పథకాన్ని సరళతరం చేసి నేతన్నలకు అండగా ఉండేలా ఈ బడ్జెట్ లో నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.  నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా గా నిలిచే బీమా యోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాలన్నారు.నేత కార్మికుల సంక్షేమం, టెక్స్ టైల్ రంగ భవిష్యత్తును నిర్దేశించే ఇలాంటి సానుకూల నిర్ణయాలను తీసుకొని మోడీ ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకునే చివరి అవకాశం ఈ బడ్డెజ్ అని కేటీఆర్ చెప్పారు. భారీగా నిధులు కేటాయించి నేతన్నలకు అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. 

చేనేతలపై పన్నును పూర్తిగా రద్దు చేయాలి

చేనేత ఉత్పత్తులపై ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు విషయంలో కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. చేనేతలపై పన్నును  పూర్తిగా రద్దు చేయాలని, ఈ బడ్జెట్ లో పన్ను  మినహాయింపును ప్రకటించాలని కోరారు.  గ్రామీణ ఆధారిత ఉపాధి అవకాశాలు కల్పించే చేనేత రంగాన్ని, దేశ వారసత్వ చరిత్రను ప్రపంచ పటం పైన ఘనంగా ఆవిష్కరించే చేనేతను కేవలం ఒక పరిశ్రమగా కాకుండా దేశ సంస్కృతి సాంప్రదాయయంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోనే వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధిని కల్పించే టెక్స్ టైల్,చేనేత రంగానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదనపు ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు కల్పించి ఆదుకోవాలని, ఈ దిశగా పరిశ్రమ వర్గాలు, నేతన్నలతో వేంటనే సంప్రదింపులు జరపాలని కేంద్రానికి మంత్రి కేటియార్ సూచించారు. దేశంలో ఉన్న హ్యాండ్లూమ్, టెక్స్ టైల్ పరిశ్రమ సుమారు 80శాతం వరకు సూక్ష్మ,మధ్యతరహా యూనిట్లుగానే ఉన్నదని, ఇప్పటికే MSMEపై ఉన్న పన్నుల భారం వలన వాటి మనుగడ చాలా కష్టంగా మారిందన్నారు. ఈ విషయంలో కేంద్ర బడ్జెట్ లో ఉదారంగా వ్యవహరించాలని, పరిశ్రమ ప్రొత్సహాక చర్యలు ప్రకటించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 20 లక్షల జీఎస్టీ స్లాబ్ ను చేనేత, పవర్లూమ్ కార్మికులకు 50 లక్షల వరకు పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన కార్పొరేట్ టాక్స్ తగ్గింపు మాదిరి మరిన్ని సంస్కరణలు ఈ పరిశ్రమలో తీసుకువస్తే విదేశాల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కేంద్రానికి కేటీఆర్ సూచించారు. ఈ దిశగా కేంద్రం అలోచించాలని కోరారు.