టెక్స్​టైల్స్​ డిపార్ట్​మెంట్​పై మంత్రి కేటీఆర్ సమీక్ష

టెక్స్​టైల్స్​ డిపార్ట్​మెంట్​పై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్,వెలుగు: చేనేత కార్మికుల్లో వృత్తి నైపుణ్యం, వారి ఆదాయం పెంచడంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి కేటీఆర్​ ఆదేశించారు. బీఆర్​కే భవన్​లో శుక్రవారం టెక్స్​టైల్స్​ డిపార్ట్​మెంట్​పై ఆయన సమీక్ష నిర్వహించారు. నేతన్నల కళకు, వృత్తికి మరింత నైపుణ్యం జోడిస్తే ఆదాయం పెంచవచ్చని, ఇందు కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధ్యయనం చేయాలని కేటీఆర్  సూచించారు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న నారాయణపేట, జోగుళాంబ గద్వాల, దుబ్బాక, కొడకండ్ల, మహదేవపూర్, కొత్తకోట తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కొత్తగా చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ తయారు చేయాలన్నారు.

ఆగస్టు 7న జరిగే జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆ రంగంలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న నేతన్నలకు గుర్తింపు ఇచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లో చేనేత మ్యూజియం ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలోని మినీ టెక్స్​టైల్స్​ పార్కులు, అప్పారెల్ పార్కుల్లో మౌలిక వసతుల కల్పనపైనా మంత్రి ఆరా తీశారు.. అక్కడ పెండింగ్​పనులు వెంటనే పూర్తి చేయాలని, బ్లాక్​ లెవల్​లో క్లస్టర్ల పనితీరు, వాటి పురోగతిపై నివేదిక అందజేయాలన్నారు. గుండ్లపోచంపల్లి అప్పారెల్​ పార్క్, గద్వాల్​హ్యాండ్లూమ్ పార్క్​లో చేపట్టిన కార్యక్రమాల గురిం చి అడిగి తెలుసుకున్నారు.

నేత కార్మికులు ఎక్కువగా ఆధారపడిన పవర్ లూమ్​సెక్టార్​లో చేపట్టాల్సిన చర్యలపైనా దృష్టి సారించాలని పేర్కొన్నారు. తమిళనాడులోని తిర్పూర్  క్లస్టర్ మాదిరిగా అత్యున్నత ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్​ పవర్​లూమ్​ క్లస్టర్​ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఇందు కోసం తిర్పూర్​ క్లస్టర్​లో పర్యటించి స్టడీ చేయాలన్నారు.