ప్రపంచంలో అత్యంత అప్పులున్న దేశాల గురించి తెలుసుకోవాలి

ప్రపంచంలో అత్యంత అప్పులున్న దేశాల గురించి తెలుసుకోవాలి

హైదరాబాద్, వెలుగు: దేశానికి కావాల్సింది డబుల్ ఇంపాక్ట్​ సర్కారని మంత్రి కేటీఆర్​అన్నారు. గురువారం తెలంగాణ భవన్​లో జరిగిన బీఆర్ఎస్​ రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో తీర్మానాలు ప్రవేశపెడుతూ మంత్రి కేటీఆర్​మాట్లాడారు. దేశానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం లేదని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు కాగానే సీఎం.. సకల జనుల సర్వే నిర్వహించి అభివృద్ధిని సుసంపన్నం చేశారన్నారు.

దేశంలో 2.8 శాతం జనాభా కలిగిన తెలంగాణ.. పంచాయితీరాజ్ శాఖలో 30శాతం అవార్డులను సొంతం చేసుకున్నదని గుర్తుచేశారు. పల్లెలతోపాటు పట్టణాలు కూడా గుణాత్మక అభివృద్ధిని నమోదు చేసుకుంటున్నాయని చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుతూనే పారిశ్రామీకరణ కొనసాగిస్తున్నామని అన్నారు. ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగిందని తెలిపారు. దేశ 75 ఏండ్ల స్వాతంత్ర్య చరిత్రలో తెలంగాణ మాత్రమే  స్టార్టప్ స్టేట్ గా ఎదిగిందని వెల్లడించారు.

శ్వేత, నీలి, పింక్, ఎల్లో ఇట్లా 5 విప్లవాలతో ప్రగతిని సాధిస్తున్నదని చెప్పారు. రూ. 4.5 లక్షల కోట్లు  కేవలం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే ఖర్చు చేయడం దేశంలోనే ఎన్నడూ జరగలేదని తెలిపారు. పాలకు జీఎస్టీ వసూలు చేస్తున్న కేంద్రం.. అదానీకి ఇచ్చిన పోర్టులకు ట్యాక్స్ ఎందుకు వేయట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. యువతను రాజకీయాల దిశగా చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. అప్పులు తేవడం తప్పుగా మాట్లాడుతున్న వాళ్లు ప్రపంచంలో అత్యంత అప్పులున్న దేశాల గురించి తెలుసుకోవాలని సూచించారు. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలైన అమెరికా, జపాన్లకు కూడా అప్పులున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.