చారిత్రక నిర్ణయాలపై సంబురాలు చేయండి: మంత్రి కేటీఆర్

చారిత్రక నిర్ణయాలపై సంబురాలు చేయండి: మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ​నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబురాలు చేయాలని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ ​పిలుపునిచ్చారు. మంగళవారం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జనరల్ ​సెక్రటరీలు, జిల్లా అధ్యక్షులతో ఆయన టెలి కాన్ఫరెన్స్​ నిర్వహించారు. 21 వేల మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వం పరిధిలోకి తెచ్చి ఆ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేసీఆర్ ​మానవీయత చాటుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులతో కలిసి సంబురాలు నిర్వహించాలని సూచించారు. 

ఒకటి, రెండు రోజుల్లో వీఆర్ఏల కుటుంబాలు, ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. హైదరాబాద్​లో ప్రస్తుతం 70 కి.మీ.లు ఉన్న మెట్రోరైల్​ను 415 కి.మీ.లకు విస్తరించేలా భారీ ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించిందని, దీని పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సంబురాలు చేయాలని సూచించారు. మెట్రో విస్తరణతో నగర విస్తరణకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. రూ.500 కోట్ల తక్షణ సాయంతో వరద ప్రభావ ప్రాంతాల్లో చేపట్టే పనులు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలపై ఎక్కడికక్కడ మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలకు వివరించాలని మంత్రి సూచించారు.