కాంగ్రెస్ కు సీఎం క్యాండిడేట్లున్నరు.. ఓటర్లు లేరు: మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ కు సీఎం క్యాండిడేట్లున్నరు.. ఓటర్లు లేరు: మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : రాహుల్, మోదీ లకు కేసీఆర్  కొరకరాని  కొయ్య అని, అందుకే కేసీఆర్ పై కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. అందరూ కలిసి  తెలంగాణ  అస్తిత్వం  మీద దాడి చేస్తున్నారని ఫైరయ్యారు. నాడు తెలంగాణ ను వ్యతిరేకించిన వాళ్ళే ఇవాళ నీతులు చెబుతున్నారన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పూర్వ నేత జిట్టా బాలక్రిష్ణారెడ్డి, టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, టీఎన్జీవో నేత  మామిళ్ల రాజేందర్ వేరువేరుగా పార్టీలో చేరిన సందర్భంగా కేటీఆర్ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగాఆయన  మాట్లాడారు.   కాంగ్రెస్ కు 10 మంది సీఎం అభ్యర్థులు దొరికారని, ఓటర్లు మాత్రం దొరకడం లేదని చురకంటించారు.  

తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఏం తక్కువ జరిగిందని  కేసీఆర్ మీద దాడి చేస్తున్నారని ప్రశ్నించారు. డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను గన్ పార్క్ దగ్గరకు రమ్మని సవాల్ చేస్తున్నారని, నవ్వాలా సావాలా అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు ఉద్యమ కారులు అండగా ఉండాలని కోరారు. సోనియా దయ తలచి తెలంగాణ ఇవ్వలేదన్నారు. బీ ఆర్ ఎస్ ఎవ్వరికీ బీ టీం  కాదని, తెలంగాణ కు ఏ టీం అవ్వల్ దర్జా టీం అని తెలిపారు. రేవంత్  అప్పుడు సోనియాను బలి దేవత అన్నాడని, ఇప్పుడు కాళీ దేవత అంటున్నాడని చెప్పారు.

రేవంత్  ఆనాడు రాహుల్  ను ముద్ద పప్పు అన్నాడని, ఇప్పుడు  నిప్పు అంటున్నాడన్నారు. రేవంత్ మారినప్పుడల్లా మనం  మారాలా  అని ప్రశ్నించారు. బీసీ ల జనగణన పై  రాహుల్  ఇప్పుడు  మాట్లాడుతున్నారని, తాము తొమ్మిది  నెలల క్రితమే అసెంబ్లీ లో తీర్మానం చేసి పంపామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీ గణన ఎందుకు చేయలేదో రాహుల్ చెప్పాలన్నారు. మోడీ ని బీజేపీ  వాళ్ళు దేవుడు  అంటున్నారని, మీకు ఇష్టముంటే  మోదీ ఫొటో ఇంట్లో పెట్టుకోండన్నారు. సిలిండర్ ధర పెంచినందుకు మోడీ దేవుడా అని నిలదీశారు.  

‘నాకు 14 ఏళ్ల వనవాసం ముగిసింది. సొంత ఇంటికి వచ్చిన సంతోషం కలిగింది. బీఆర్ఎస్ లో  చేరడం పై నా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటి కాకపోతే.. మళ్లీ తెలంగాణ కు మోసం జరుగుతుంది’ అని జిట్టా బాలక్రిష్ణారెడ్డి  తెలిపారు. ‘సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నేను వీఆర్ఎస్  తీసుకొని బీఆర్ఎస్ లో చేరుతున్న. ముదిరాజ్ లకు వచ్చే ప్రభుత్వం లో సముచిత స్థానం ఇచ్చే విధంగా  కృషి చేస్తా’ అని మామిళ్ల రాజేందర్ చెప్పారు. మూడోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని టీడీపీసీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.