కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ద్వారా 30 వేల మందికి ఉపాధి

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ద్వారా  30 వేల మందికి ఉపాధి

వరంగల్ కు పూర్వ వైభవం కలిగే విధంగా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాకతీయ మెగా  టెక్స్ టైల్ పార్కు కోసం భూమి కోల్పోయిన రైతులకు ఇండ్ల స్థలాల పట్టాలను ఆగస్ట్ 15 లోపు ఇస్తామని వెల్లడించారు. కొరియా యంగ్ వన్ సంస్థ ద్వారా  20 వేల మందికి ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. కోటెక్స్ ద్వారా కూడా 4 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. మొత్తం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ద్వారా సుమారు 30 వేల మంది ఉపాధి కలుగుతుందని తెలిపారు. ఈ పార్కులో 99 శాతం స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి చెప్పారు.

దేశంలో వ్యవసాయం తర్వాత పరిశ్రమల ద్వారా ఉపాధి ఎక్కువ కలుగుతుందని తెలిపారు. ప్రపంచంలో అధిక శాతం బట్టల తయారీ శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల్లో జరుగుతుందని అన్నారు. త్వరలో తెలంగాణలో కూడా బట్టల తయారీ రంగంలో ముందుండబోతుందన్నారు. తెలంగాణలో నల్ల బంగారం, తెల్ల బంగారం రెండూ ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 

తెలంగాణలో  అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను కాపీ కొట్టి  వేరే పేరుతో కేంద్రం అమలు చేస్తోందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా అనేక అవార్డులు వస్తున్నాయని మంత్రి గుర్తుచేశారు. దళిత బంధు, రైతు బంధు వంటి పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. టెక్స్ టైల్ పార్క్ లో  మరిన్ని కంపెనీలు ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.