సిరిసిల్లను వేల కోట్లతో డెవలప్ చేసిన: కేటీఆర్

 సిరిసిల్లను వేల కోట్లతో డెవలప్ చేసిన: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చెయ్యనని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, లీడర్లు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తరు. కానీ నాకు అది చాతగాదు. ఎలక్షన్లల్ల ఒక్క రూపాయి కూడా పంచలేదు. చుక్క ముందు పోయలేదు. భవిష్యత్తుల కూడా మందు పొయ్య.. పైసలియ్య. సిరిసిల్లను వేల కోట్లతో అభివృద్ధి చేశాను. ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ల ఆశీర్వాదం ఉంటే మళ్లీ గెలుస్త” అని ఆయన చెప్పారు. ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించారు. గంభీరావుపేట మండలం గోరింట్యాల జడ్పీ హైస్కూల్‌‌‌‌లో అడిషనల్ క్లాస్ రూమ్స్, ఎల్లారెడ్డిపేటలో రూ.8.5 కోట్లతో అభివృద్ధి చేసిన జడ్పీ హైస్కూల్​క్యాంపస్ ను ప్రారంభించారు. సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో వెయ్యి మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు.

అనంతరం సిరిసిల్ల మినీ స్టేడియంలో వాలీబాల్ అకాడమీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తొమ్మిదేండ్లలో తెలంగాణలో సమూల మార్పులు తెచ్చామని ఆయన అన్నారు. ‘‘కొంతమంది ప్రతిపక్ష నాయకులు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. వ్యవస్థలో లోపాలు వెతికేటోళ్లకు లోపాలే కనిపిస్తాయి” అని ఫైర్ అయ్యారు. 

పైలట్ ప్రాజెక్టుగా ‘కంప్యూటర్ చాంప్స్’

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచుతున్నామని కేటీఆర్ చెప్పారు. ‘‘మన ఊరు మన బడి కింద రాష్ట్రంలోని 26 వేల పాఠశాలలను బాగు చేయాలని నిర్ణయించాం. అందులో భాగంగా మొదటి దశలో రూ.7,300 కోట్లతో 9 వేల పాఠశాలలను బాగు చేస్తున్నాం. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది. రాష్ట్రంలో సాగునీరు, తాగు నీరు, బడులు, గుడులు, కరెంట్, రోడ్లు.. ఇలా ప్రతిదీ బాగు చేసేందుకు వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం” అని తెలిపారు. సర్కార్ బడుల విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించేందుకు ‘కంప్యూటర్ చాంప్స్’ కార్యక్రమం అమలు చేస్తామని వెల్లడించారు. ‘‘దీన్ని జిల్లాలోని 60 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నాం.

జిల్లాలో సక్సెస్ రేట్ ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. రాష్ట్రంలోని 26 వేల పాఠశాలలకు ఫైబర్ గ్రిడ్ ద్వారా బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ అందిస్తాం” అని ప్రకటించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు 53 శాతం నుంచి 73 శాతానికి పెరిగాయని.. విద్యలో దేశంలోనే ఉత్తమ జిల్లాగా సిరిసిల్లను మారుస్తామని చెప్పారు. 

దివ్యాంగులకు అండగా ఉంటాం.. 

దివ్యాంగులకు అండగా ఉంటామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 5.16 లక్షల మంది దివ్యాంగులు ఉండగా.. వాళ్ల సంక్షేమం కోసం ఏటా రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తున్నం. కేవలం పెన్షన్ల కోసమే ఏటా రూ.1,540 కోట్లు ఖర్చు చేస్తున్నం. ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగులకు రూ.4,016  పింఛన్ ఇస్తున్నం. దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహం కూడా అందజేస్తున్నం. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రూ.37.83 కోట్లు పంపిణీ చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగులకు తక్కువ ఉపకరణాలే ఇచ్చేవారు. మేం లక్షా 15 వేల విలువైన వాహనాన్ని ఉచితంగా అందజేస్తున్నం. ఇప్పటి వరకు 42,417 మందికి ఇచ్చాం” అని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 5 శాతం దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయించి, వాళ్లకు గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇండ్లను అందజేస్తామన్నారు. 

కేటీఆర్ సమక్షంలో బయటపడ్డ విభేదాలు 

బీఆర్ఎస్ గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. జడ్పీ హైస్కూల్ ప్రారంభోత్సవంలో ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో నాకు పడదు. అయినప్పటికీ కేటీఆర్ గెలుపు కోసం రానున్న ఎన్నికల్లో కలిసి పని చేస్తాం” అని అన్నారు. అయితే తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ.. తన గెలుపులో ప్రజలే కీలక పాత్ర పోషిస్తారని, తాను వాళ్లనే నమ్ముకున్నానని అన్నారు.