జర్నలిస్ట్లకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తాం: కేటీఆర్

జర్నలిస్ట్లకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తాం: కేటీఆర్

జర్నలిస్ట్ లకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్  ప్రకటించారు.  అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్.. రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు  ప్రయత్నిస్తున్నామని చెప్పారు.  విదేశాల్లో జర్నలిజం కోర్సులు చదువుకునే వాళ్లకు రూ. 5 లక్షలు ఇస్తున్నామని అన్నారు. కరోనా టైంలో స్కూల్ టీచర్లను, జర్నలిస్టులను మానవీయ కోణంలో ఆదుకున్నామని చెప్పారు. సోమాజిగూడ, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ల డెవలప్ మెంట్ లకు నిధులు కేటాయించామని తెలిపారు. 

చేనేత కార్మికులపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. మెగా పవర్  లూమ్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరితే  స్పందించకపోగా..నేతన్నలకు వాతలు పెడుతోందని విమర్శించారు. నేతన్నకు భీమా  ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ దేనన్నారు. నేతన్నలు చనిపోతే కుటుంబానికి రూ. 50 వేలు అందజేశామని చెప్పారు.  నేతన్నకు చేయూత కార్యక్రమం ద్వారా కరోనా టైంలో  రూ.100 కోట్లు కేటాయించామని తెలిపారు. 35 కోట్ల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. 

ఒకరు  ప్రగతి భవన్ ను, మరొకరు సెక్రటేరియట్ ను కూల్చాలని ప్రకటనలు చేస్తున్నారని.. పిచ్చోళ్ళ చేతుల్లో రాష్ట్రం పెట్టొద్దని కేటీఆర్ అన్నారు.  గతంలో బీడు భూమిగా ఉన్న దండుమల్కాపూర్ ఇప్పుడు పచ్చగా మారిందన్నారు.  సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ కూడా పచ్చగా మారిందన్నారు. ప్రగతిశీల నిర్ణయాల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఐటీఐఆర్ పై కేంద్రాన్ని ఎన్ని సార్లు అడిగిన స్పందించడం లేదని కేటీఆర్ అన్నారు. ఐటీ నిరుద్యోగుల నోట్లో కేంద్రం మట్టికొట్టిందని విమర్శించారు.  కర్ణాటక, తెలంగాణాలో ఎందుకు ఐటీఐఆర్ రద్దు చేశారని ప్రశ్నించారు.