నాలాలపై ఉన్న 25 వేల  ఇండ్లను తరలిస్తం

నాలాలపై ఉన్న 25 వేల   ఇండ్లను తరలిస్తం
  • మత నిర్మాణాల వల్లే పాతబస్తీ మెట్రో ఆలస్యమైందన్న కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ మాదిరి ఉండేలా మూసీని సుందరీకరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.‘‘కరోనా వల్ల ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. ఇదేనా బంగారు తెలంగాణ, ఇదేనా విశ్వనగరం అంటూ కొందరు సోషల్ మీడియాలో జోకులు వేస్తుంటారు. దేనికైనా టైం పడుతుంది. మూసీలోకి 90 శాతం మురుగే వస్తుంది. మూసీ నాలాలపై 25 వేల దాకా ఉన్న పేదల ఇండ్లను తరలించాలని సీఎం కేసీఆర్ ను, ఆర్​అండ్ బీ మంత్రిని కోరతాం. వాళ్లందరినీ డబుల్ బెడ్రూం ఇండ్లలోకి షిఫ్ట్ చేయాలని భావిస్తున్నం” అని చెప్పారు. మంగళవారం శాసనమండలిలో ఓల్డ్ సిటీపై చర్చలో మంత్రి మాట్లాడారు. ‘‘గత కాంగ్రెస్ ప్రభుత్వం పాతబస్తీపై పదేండ్లలో రూ.3,934 కోట్లు ఖర్చుపెడితే, మా ప్రభుత్వం రూ.14,887 కోట్లు ఖర్చు చేస్తోంది. చార్మినార్​ పాతబస్తీకి పరిమితం కాదు. పర్యాటక క్షేత్రంగా మారుస్తం. మూసీపై 55 కి.మీ. పరిధిలో 14 బ్రిడ్జిలు మరో 3, 4 చెక్ డ్యాములు కడతాం. ఎంజీబీఎస్ నుంచి ఫలక్​నుమా దాకా పాతబస్తీలో 5.5 కి.మీ. పొడవున మెట్రో రైల్ ప్రాజెక్టు పలు కారణాలతో పూర్తవలేదు. ఆ ప్రాంతంలో 93 మతపరమైన నిర్మాణాలున్నాయి. చాలా సున్నితమైన అంశం కావడంతో కాస్త ఆలస్యమవుతోంది. దీనిపై ఎల్​అండ్ టీ ప్రతినిధులు సీఎంను కలిసి సాయం కోరారు” అని చెప్పారు. కొందరు మాట్లాడితే భాగ్యలక్ష్మి టెంపుల్​కే ఉరుకుతున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ ను ఉద్దేశించి విమర్శించారు.
కేంద్రం 5 వేల కోట్లే ఇచ్చింది
హైదరాబాద్ లో రూ.3,100 కోట్లతో అండర్‌‌ గ్రౌండ్‌‌ డ్రైనేజీలు నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కౌన్సిల్‌‌లో క్వశ్చన్‌‌ అవర్‌‌లో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 2020 ఏప్రిల్‌‌ నుంచి ఇప్పటి దాకా కొత్త పరిశ్రమల ప్రారంభంతో 2.6 లక్షల మందికి ఉపాధి దొరికిందన్నారు. కేంద్రం రూ.20 లక్షల కోట్లతో కరోనా ప్యాకేజీ ప్రకటించినా, రాష్ట్రానికి కేవలం 5 వేల కోట్లే ఇచ్చిందన్నారు. అవన్నీ ఎవరికి ఇచ్చారు? ఎక్కడికి పోయాయో? అని ఎంత శోధించినా దొరకడం లేదన్నారు.