మా స్కీమ్​లే.. కాంగ్రెస్, బీజేపీ కాపీ కొట్టినయ్ : కేటీఆర్

మా స్కీమ్​లే.. కాంగ్రెస్, బీజేపీ కాపీ కొట్టినయ్ : కేటీఆర్
  • మా స్కీమ్​లే.. కాంగ్రెస్, బీజేపీ కాపీ కొట్టినయ్
  • రైతు బంధు స్కీమ్ కాపీ కొట్టింది కాంగ్రెస్ కాదా?: కేటీఆర్
  • బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి కాంగ్రెసోళ్లు చద్దర్లు కప్పుకుని పడుకున్నరు
  • 45 రోజులు కష్టపడాలని పార్టీ కార్యకర్తలకు సూచన

రాజన్నసిరిసిల్ల, వెలుగు : బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి కాంగ్రెస్సోళ్లు చద్దర్లు కప్పుకుని పడుకున్నారని, స్కీమ్​లు కాపీ కొట్టే స్థితిలో తాము లేమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ తీసుకొచ్చిన స్కీములే దేశమంతా కాపీ కొడుతున్నదని చెప్పారు. రాబోయే 45 రోజులు కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పని చేస్తే.. తాము ఐదేండ్లు మీ కోసం పని చేస్తామన్నారు. బీఆర్ఎస్​కు కార్యకర్తలే బలమని, 60లక్షల సభ్యత్వాలతో బీఆర్ఎస్ దేశంలో నంబర్ వన్​గా ఉందని తెలిపారు. సోమవారం సిరిసిల్లలో బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ ను పార్టీ సెక్రటరీ జనరల్ కేశవ రావు, మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి కేటీఆర్​ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘స్కీమ్​లు కాపీ కొట్టామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ స్కీమ్​లే దేశం మొత్తం కాపీ కొడుతున్నది. రైతు బంధు కింద మేం ఎకరాకు రూ.10వేలు ఇస్తుంటే.. కాంగ్రెసోళ్లు రూ.15వేలు ఇస్తామంటున్నరు. కాపీ ఎవరు కొట్టినట్లు? కర్నాటకలో అమలవుతున్న స్కీములన్నీ బీఆర్ఎస్​ను చూసి కాపీ కొట్టినవే.. కేంద్రంలో మోదీ కూడా మా స్కీమ్​లు కాపీ కొట్టారు. రైతు బంధుకు పీఎం కిసాన్ సమ్మాన్ అని, మిషన్ భగీరథకు ‘హర్ ఘర్ జల్’ అని, టీఎస్ ఐపాస్​కు సింగిల్ విండో అని, మిషన్ కాకతీయకు అమృత్ సరోవర్ అని పేరు మార్చి అమలు చేస్తున్నారు”అని కేటీఆర్ విమర్శించారు. 

ప్రతిపక్షాలకు అఖల్ లేదు

‘‘నఖల్ మార్నేకో అఖల్ చాహీయే”అని పెద్దలు చెప్తుంటారని, కనీసం నఖలు కొట్టడానికి ప్రతిపక్షాలకు అఖల్ లేదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్​ను తిడితే ఓట్లు పడ్తాయని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయన్నారు. కానీ.. కేసీఆర్​ను ఎంత తిడితే అన్ని ఓట్లు బీఆర్ఎస్​కు పడ్తాయన్నారు. కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ దీమా అనే స్కీమ్ బాగా నచ్చిందని తెలిపారు. స్కీమ్ రూపకల్పనలో తనపాత్ర కూడా ఉందని చెప్పారు. ఈ స్కీమ్​కు పేరు పెట్టింది కూడా తానే అని స్పష్టం చేశారు. పార్టీలో ఎవరొచ్చినా చేర్చుకోవాలని, బీఆర్ఎస్ లీడర్లు తమ ఈగోలు పక్కన పెట్టాలని సూచించారు. కార్యకర్తలు కష్టపడి పని చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

కేసీఆర్ అంటే లీడర్ కాదని.. తెలంగాణ ఆస్తి అని మంత్రి గంగలు కమలాకర్ అన్నారు. ఆస్తిని కాపాడుకుంటే తెలంగాణ పచ్చగా ఉంటుందని తెలిపారు. సిరిసిల్లలో మోడ్రన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకునే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్, ఎమ్యెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవి శంకర్, ఎమ్మెల్సీ రమణ, వేములవాడ ఎమ్యెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మినరసింహా రావు, జడ్పీ చైర్​పర్సన్ అరుణ, తదితరులు పాల్గొన్నారు.