అధికార కాంక్ష తప్ప..ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదు

అధికార కాంక్ష తప్ప..ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదు

వేలకోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలని కొన్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు బీజేపీ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఇక్కడి ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ బాద్షాలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరన్న విషయం..మునుగోడులో అమిత్ షా చేసిన ప్రసంగంతో మరోసారి రుజువైందన్నారు. అబద్ధాలకు పెద్దకొడుకు అమిత్ షానే అన్న కేటీఆర్​.. అధికార కాంక్ష తప్ప ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని పసలేని ప్రసంగం చేశారని విమర్శించారు.

మొన్న నల్లచట్టాలతో దేశ రైతులకు ఉరితాడు బిగించాలనుకున్న మోడీ ప్రభుత్వం.. తాజాగా విద్యుత్ చట్టంతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రలకు తెరతీసిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ దేశ రైతులకు ఏం చేయాలన్న విషయాలపై అవగాహన లేని మోడీ ప్రభుత్వానికి ఓ దారి చూపించింది కేసీఆరే అన్న సంగతిని అమిత్ షా మర్చిపోయారన్నారు. రైతుబంధు పథకాన్ని పేరు మార్చి పీఎం కిసాన్ గా అమలుచేస్తున్న సంగతిని అమిత్ షా గుర్తుంచుకోవాలన్నారు. దేశంలోని ప్రతీ రంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న మోడీ ప్రభుత్వం.. నేతన్నలకు తీరని అన్యాయం చేసిందన్నారు.

ఫసల్ బీమా యోజనలో తెలంగాణ ఎందుకు చేరలేదని ప్రశ్నించిన అమిత్ షా.. ఆ పథకం నుంచి గుజరాత్ ఎందుకు వైదొలిగిందో మునుగోడులో చెప్తే బాగుండేదని కేటీఆర్ అన్నారు. మోడీ తీసుకొచ్చిన ఫసల్ బీమాతో ఇన్సూరెన్స్ కంపెనీలకే ప్రయోజనం తప్ప రైతులకు కాదని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాత్ రాజకీయ వ్యాపారుల ముందు తాకట్టు పెట్టిన గల్లీ నాయకులను చరిత్ర క్షమించదన్నారు. “ఆత్మాభిమానంలేని కొందరు తొత్తులు మీ చెప్పులు మోయొచ్చుగానీ.. తెలంగాణను చెప్పు చేతల్లో పెట్టుకోవాలని  మీరు చేస్తున్న కుట్రలకు ఆత్మగౌరవం వున్న తెలంగాణ జాతి ఎప్పుడూ లొంగదనే విషయాన్ని గుర్తుంచుకోండి” అని కేటీర్ అన్నారు.