లోకల్ బాడీ ఎమ్మెల్సీల్లో మనోళ్లంతా మనకే ఓటెయ్యాలె

లోకల్ బాడీ ఎమ్మెల్సీల్లో మనోళ్లంతా మనకే ఓటెయ్యాలె
  • మంత్రులు, లీడర్లకు కేటీఆర్ ఆదేశాలు
  • కరీంనగర్‌‌, ఖమ్మం, ఆదిలాబాద్‌‌పై నజర్
  • కరీంనగర్ ఓటర్లను బతిలాడుతున్న మంత్రులు

హైదరాబాద్‌‌, వెలుగు: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌, మంత్రి కేటీఆర్‌‌ ఫోకస్‌‌ పెట్టారు. ఎలక్షన్‌‌ క్యాంపు ఇన్‌‌చార్జీలతో రోజూ టెలీ కాన్ఫరెన్సుల్లో మాట్లాడుతున్నారు. ప్రతి ఓటూ ఎట్టి పరిస్థితుల్లో పార్టీకే పడేలా చూడాలని జాగ్రత్తలు చెప్తున్నారు. మొత్తం 12 స్థానాలకు ఆరు ఏకగ్రీవం కాగా కరీంనగర్‌‌ లో రెండు, ఆదిలాబాద్‌‌, నిజామాబాద్‌‌, మెదక్‌‌, ఖమ్మం, నల్గొండల్లో ఒక్కో సీటుకు 10న పోలింగ్‌‌ జరగనుండటం తెలిసిందే. తమకు నిధులు, విధుల్లేవని, ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా నిలుపుకోలేదని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గుర్రుగా ఉన్నారు. దీంతో వీరిలో పలువురు క్రాస్‌‌ ఓటింగ్‌‌కు పాల్పడవచ్చని కేటీఆర్‌‌ నేరుగా రంగంలోకి దిగారు.

కరీంనగర్లో కనాకష్టమే!
కరీంనగర్‌‌, ఖమ్మం, ఆదిలాబాద్‌‌ సీట్లపై అధికార పార్టీ హైరానా పడుతోంది. అక్కడ గెలుస్తామని ఆ పార్టీ లీడర్లే నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. ‘పోతే ఒకటి రెండు ఎమ్మెల్సీలు పోతై. అదేమన్న పెద్ద ముచ్చట్నా’ అని పార్టీ చీఫ్‌‌, సీఎం కేసీఆర్‌‌ ఇటీవల ప్రెస్‌‌మీట్లో చేసిన కామెంట్లు ఆ సీట్ల విషయంలో పార్టీ మైండ్ సెట్ కు అద్దం పడుతున్నాయంటున్నారు. కరీంనగర్లో మాజీ మేయర్‌‌ రవీందర్‌‌ సింగ్‌‌ టీఆర్‌‌ఎస్‌‌ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగారు. ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌‌ రెడ్డి కూడా టీఆర్ఎస్ పై తిరుగుబావుటా ఎగురవేశారు. మరో ఆరుగురు ఇండిపెండెంట్లు కూడా కరీంనగర్లో పోటీలో ఉన్నారు. రవీందర్‌‌ సింగ్‌‌కు కాంగ్రెస్‌‌, బీజేపీ ఓట్లు పోలవుతాయంటున్నారు. బెంగళూరులోని తమ క్యాంపులో 1,100 మంది దాకా ఓటర్లున్నారని టీఆర్‌‌ఎస్‌‌ బయటికి ధీమాగా చెప్తున్నా వారిలో పలువురు క్రాస్‌‌ ఓటింగుకు పాల్పడతారేమోనని లీడర్లలో ఆందోళన కనిపిస్తోంది. దాంతో కరీంనగర్‌‌ ఓటర్లను నిశితంగా మానిటర్ చేయడానికి మంత్రులు గంగుల కమలాకర్‌‌, కొప్పుల ఈశ్వర్‌‌, ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, ప్లానింగ్‌‌ బోర్డు వైస్‌‌ చైర్మన్‌‌ వినోద్‌‌ కుమార్‌‌లు రంగంలోకి దిగారు. సిట్టింగ్‌‌ ఎమ్మెల్సీ భానుప్రసాద్‌‌రావుపై గుర్రుగా ఉన్న ఓటర్లతో వారు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఎలాగోలా పార్టీకే ఓటు వేస్తామని మాటివ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. బాగా కలవరపాటుకు గురిచేస్తున్న కరీంనగర్‌‌లో జెడ్పీటీసీలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు రూ.3 లక్షల చొప్పున నగదు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. షాపింగ్‌‌, ఇతర అవసరాల కోసం వారందరికీ అదనంగా మరో లక్ష చొప్పున ముట్టచెప్తున్నట్టు సమాచారం. మెదక్‌‌ జిల్లా ఓటర్లలో కొందరిని ఢిల్లీకి, మరికొందరిని మైసూరుకు తరలించారు. నల్గొండ ఓటర్లను కూడా రెండు రోజుల్లో క్యాంపులకు తీసుకెళ్లాలని ప్లాన్‌‌ చేస్తున్నారు. ఏం చేసైనా ఓటర్లను మెప్పించి పార్టీకే ఓటేసేలా చూడాలని  మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లకు కేటీఆర్‌‌ ఆదేశాలిస్తున్నారు. రోజూ ఉదయం వారితో టెలి కాన్ఫరెన్స్‌‌ పెట్టి అక్కడ ఏం జరుగుతోందనే వివరాలు తెలుసుకుంటున్నారు. 

ఆదిలాబాద్ పైనా అనుమానాలే
ఆదిలాబాద్‌‌ సీటుపైనా టీఆర్‌‌ఎస్‌‌ నేతల్లో అనుమానాలున్నాయి. ఇండిపెండెంట్‌‌ క్యాండిడేట్‌‌కు తుడుం దెబ్బతో పాటు అధికార పార్టీకే చెందిన కొందరు అంతర్గతంగా సహకరిస్తున్నారనే ప్రచారముంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ క్యాండిడేట్ కే ఓట్లేయించే బాధ్యతను కూడా ఎమ్మెల్యేలకే అప్పగించారు. ఖమ్మంలో కూడా ఓ  కీలకనేత అనుచరుల నుంచి అధికార పార్టీ అభ్యర్థికి చిక్కులు తప్పవని టీఆర్ఎస్ గుర్తించినట్టు సమాచారం. దీంతో సదరు నేతతో కేటీఆరే నేరుగా మాట్లాడి, పార్టీ అభ్యర్థికే ఓటేసేలా అనుచరులకు నచ్చజెప్పాలని సూచించినట్టు తెలిసింది. ఒక్క ఓటు కూడా చేజారనివ్వొద్దని  మంత్రి పువ్వాడ అజయ్‌‌కు కేటీఆర్ చెప్పినట్టు తెలిసింది.