టౌన్ల అభివృద్ధికి పదేండ్లలో లక్ష కోట్లు ఖర్చు చేసినం

టౌన్ల అభివృద్ధికి పదేండ్లలో  లక్ష కోట్లు ఖర్చు చేసినం

అందులో కేంద్రం ఇచ్చింది 9 వేల కోట్లే: కేటీఆర్

  •     హైదరాబాద్​లో 24 గంటలూ మంచినీళ్లు ఇస్తం 
  •     మూసీపై ఎక్స్ ప్రెస్ వే నిర్మిస్తం.. పాతబస్తీకి మెట్రోను విస్తరిస్తం
  •     ఎంఏయూడీ రిపోర్టు రిలీజ్​లో మంత్రి 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రానికి 70% ఆదాయం మున్సిపాలిటీల నుంచే వస్తున్నదని, అందుకే పట్టణాల్లో సౌలతుల కోసం అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పట్టణాల అభివృద్ధికి పదేండ్లలో రూ.1.21 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అయితే అందులో రూ.9 వేల కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని పేర్కొన్నారు. 

ఇంత ఖర్చు చేశాం కాబట్టి తెలంగాణ భూతల స్వర్గమైందని తాను చెప్పడం లేదన్నారు. బుధవారం మెట్రో రైల్​భవన్​లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్(ఎంఏయూడీ) పదేండ్ల నివేదిక (2014 -23)ను కేటీఆర్ రిలీజ్ ​చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలోని మున్సిపాలిటీలకు 2004 నుంచి 2014 మధ్య అప్పటి ప్రభుత్వాలు రూ.26,211 కోట్లు మాత్రమే ఖర్చు చేశాయని తెలిపారు. ‘‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మున్సిపల్​డిపార్ట్​మెంట్​సాధించిన ప్రగతిపై వార్షిక నివేదికలు రిలీజ్​చేస్తున్నాం. ప్రధాని మోదీ సూచనతోనే అహ్మదాబాద్​తరహాలో జీహెచ్ఎంసీకి బాండ్ల రూపంలో నిధులు సేకరించాం. రాష్ట్రంలోని పట్టణాల్లో గడిచిన తొమ్మిదేండ్లలో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలి. పట్టణాల అభివృద్ధి కోసం ఇంకా చేయాల్సిన పనులెన్నో ఉన్నాయి. 

మేం చేసిన పనులను కేంద్రం గుర్తించాల్సిన పరిస్థితి కల్పించాం.. కాబట్టే మాకు రాజకీయ ప్రత్యర్థి అయినా అవార్డులు ఇవ్వక తప్పడం లేదు. జీహెచ్ఎంసీలో రూ.67 వేల కోట్లు ఖర్చు చేశామని నేను అసెంబ్లీలో చెప్పాను. ఇప్పుడు నివేదికలో మాత్రం రూ.44 వేలు కోట్లే ఉందనే ప్రశ్నలు తలెత్తుతాయి. నేను ఆ రోజు చెప్పిన మొత్తం అన్ని డిపార్ట్​మెంట్ల కలిపి ఖర్చు చేసినవి. ఒక్క మున్సిపల్​డిపార్ట్​మెంట్​మాత్రమే రూ.44 వేల కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర జనాభాలో 30 శాతం ఇక్కడే నివసిస్తున్నారు కాబట్టి ఇంత ఖర్చు చేయాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు. 

మెట్రో ప్రయాణికులను 15 లక్షలకు పెంచుతం.. 

హైదరాబాద్​లో 3,800 ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయని, వాటి స్థానంలో ఎలక్ట్రిక్​ బస్సులు తేవాల్సి ఉందని కేటీఆర్ చెప్పారు. ‘‘మొదటి దశలో వెయ్యి డొక్కు బస్సులు తీసేసి ఎలక్ట్రిక్​ బస్సులు తెస్తున్నాం. దశల వారీగా మిగతా బస్సులు తెస్తాం. హైదరాబాద్​మెట్రోలో ఇప్పుడు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆ సంఖ్యను 15 లక్షలకు చేర్చడమే మా లక్ష్యం. కార్లతో నగరంలో ట్రాఫిక్​ సమస్య పెరుగుతున్నది. కార్లు తగ్గితే ట్రాఫిక్ తగ్గుతుంది. సిద్దిపేటలో అమలు చేస్తున్న స్వచ్ఛ బడిని రాష్ట్రమంతా అమలు చేస్తాం. ట్యాంక్​బండ్​పై బర్త్​డే చేసుకున్నోటోళ్లు ఆ చెత్తను అక్కడే పడేస్తే ఎలా? కోటి మందికిపైగా ప్రజలు నివసించే హైదరాబాద్​ను 20 వేల మంది మాత్రమే శుభ్రం చేయాలంటే కుదరదు. ప్రజలు చెత్తను డస్ట్​బిన్​లో వేయడం అలవాటు చేసుకోవాలి” అని సూచించారు.

 రక్షణ శాఖ భూములు ఇస్తలేరు.. 

ఇదేనా బంగారు తెలంగాణ, బంగారు హైదరాబాద్? అని ప్రశ్నిస్తున్నోళ్లు..  2014లో పరిస్థితి ఎట్ల ఉండేదో పోల్చుకోవాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్​లో 24 గంటలూ మంచి నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ‘‘రోమ్​ను ఒక్కరోజులోనే నిర్మించలేదనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.  మా సీఎం హైదరాబాద్​ను డల్లాస్​ చేస్తామంటే ఇన్ని రోజులు నవ్వితిరి. ఈరోజు రజనీకాంత్​ వచ్చి హైదరాబాద్​ న్యూయార్క్ ​లెక్క ఉందని ఎందుకు చెప్తున్నడు. అంటే పైన మాత్రమే న్యూయార్క్​ లెక్క కాదు. కింద కూడా కావాలే.. ఇది నేను కూడా ఒప్పుకుంటా” అని అన్నారు. రక్షణ శాఖ భూములిస్తే అభివృద్ధి పనులు చేసుకుంటామని ఐదుగురు కేంద్ర మంత్రులను అడిగినా ఇవ్వలేదన్నారు. రసూల్​పుర చౌరస్తాలో ఎకరంన్నర భూమి ఇవ్వాలని గతంలో రక్షణ శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్​రెడ్డిని అడిగినా ఆయన ఆ పని చేయలేదన్నారు. ‘‘మొన్న అమిత్​షా కలుస్తానని టైమ్ ఇచ్చిండు.. తర్వాత ఆయన కూడా ముఖం చాటేసిండు” అని మండిపడ్డారు.

 డబుల్ డెక్కర్ స్కైవేలు నిర్మిస్తం.. 

నగరంలో నాలాల విస్తరణకు కట్టుబడి ఉన్నామని కేటీఆర్ తెలిపారు. ‘‘మురుగు నీటిని శుద్ధి చేయడానికి రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తాం. మూసీపై రూ.10 వేల కోట్లతో ఎక్స్​ప్రెస్ ​హైవే నిర్మిస్తాం. ఓల్డ్​సిటీలో మెట్రో విస్తరణకు కట్టుబడి ఉన్నాం. శామీర్​పేట, మేడ్చల్ ​వైపు డబుల్ ​డెక్కర్​స్కైవేలు నిర్మిస్తాం. కంటోన్మెంట్​ను జీహెచ్​ఎంసీలో విలీనం చేయాలని మేం కోరుతున్నాం. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే. జీవో 111ను రద్దు చేశాం. ఆ ప్రాంతాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తాం. ఒక్క హైదరాబాద్​లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం” అని చెప్పారు. కాగా, జీహెచ్​ఎంసీ కమిషనర్​గా పని చేసి అడిషనల్​ సీఈవోగా బదిలీ అయిన లోకేశ్​కుమార్​ను కేటీఆర్ ​సత్కరించారు.